ఫీజులు వసూలు చేసి స్కూళ్లు బంద్ చేశారు

by Anukaran |
Congress leader Dasoju Shravan
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోవిడ్ సెకండ్ వేవ్ ముంచుకొస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకుండా అలసత్వం వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటివరకూ తెలంగాణ ప్రభుత్వం 9.43 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చిందని, నాలుగు కోట్ల మందికి ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ అందించాలనే చిత్తశుద్ధి కేసీఆర్ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో 47లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. వ్యాక్సిన్ ఇవ్వడంలో మన రాష్ట్రం ఎందుకు వెనకబడిందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 17.7 శాతం వ్యాక్సిన్ వృథా అవుతుందని కేంద్రం చెబుతుంటే అధికారులు మాత్రం 0.7 శాతం మాత్రమే వృథా అవుతుందని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. సెకండ్ వేవ్ ముంచుకొస్తున్నందున ప్రభుత్వం వ్యాక్సినేషన్ పై దృష్టిపెట్టి ప్రతి బస్తీ దవాఖానాను వ్యాక్సినేషన్ కేంద్రంగా మార్చాలని శ్రవణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, విద్యాసంస్థలు కలిసి కుట్రచేసి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశాక స్కూళ్లను మూసివేశారని ఆరోపించారు. స్కూళ్లను మూసేసినట్లు థియేటర్లు, షాపులు, బార్లను మూసివేయాలని కోరారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story