కాంగ్రెస్‌ పార్టీకి జ్యోతిరాదిత్య రాజీనామా!

by Shamantha N |   ( Updated:2020-03-10 05:10:17.0  )
కాంగ్రెస్‌ పార్టీకి జ్యోతిరాదిత్య రాజీనామా!
X

మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. అయితే, జ్యోతిరాదిత్యను పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరించింది. ఈ నిర్ణయానికి సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో సింధియా కీలక పాత్ర పోషించారు. తన తండ్రి మాధవరావు సింధియా తర్వాత జ్యోతిరాదిత్య సింధియా వారసత్వంగా రాజకీయాల్లో ప్రవేశించి కీలక భూమిక పోషించారు. యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. 2018, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినా ఆయనకు సీఎం పీఠం దక్కలేదు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజ్యసభ సీటు కూడా దక్కే అవకాశం లేకపోవడంతో సింధియా రగిలిపోయారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో ఆయన నిష్క్రమణ దాదాపు ఖాయమైంది. ఆయన బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే, జ్యోతిరాదిత్య సింధియాకు మేనత్త కావడం గమనార్హం.
‘గత 18 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా కొనసాగుతున్నాను. ప్రస్తుతం పార్టీని వీడే సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా దేశం, రాష్ట్ర ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు ఎలాంటి సేవ చేయలేనని నమ్ముతున్నాను. కొత్త దారిలో వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీలో తనకు సహకరించిన సీనియర్ నేతలకు, నాయకులకు ధన్యవాదాలు’ అని జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Tags: Congress, Jyotiraditya Scindia,Anti-Party,Activities,resignation to Congress

Advertisement

Next Story