బిగ్ బ్రేకింగ్ : టీఆర్‌ఎస్‌లో కౌశిక్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్..

by Anukaran |   ( Updated:2021-07-20 01:37:42.0  )
koushik-reddy-trs
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు కాంగ్రెస్ బహిష్కృత నేత పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల ఆయన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజూర్‌నగర్ ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం మేరకే టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని.. ఒక్క అవకాశం ఇస్తే హుజురాబాద్‌లో అభివృద్ధి అంటే ఏమిటో రెండేళ్లలో చూపిస్తామన్నారు. చెప్పింది చేయకపోతే మళ్లీ టీఆర్ఎస్‌కు ఓటు వేయొద్దన్నారు. టీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లాభం చేకూరుతుందని.. ప్రతీ దళితుడికి న్యాయం చేయాలనే ‘దళిత బంధు’ పథకాన్ని రూపకల్పన చేశారని వివరించారు. ఈ పథకాన్ని హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించడం సంతోషకరమన్నారు.

ఈటల గెలిస్తే వ్యక్తిగత లాభమే..

హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటలను గెలిపిస్తే ఆయన వ్యక్తిగత అభివృద్ధి తప్ప నియోజకవర్గ అభివృద్ధి ఉండదన్నారు. 18 ఏళ్లు ఎమ్మెల్యేగా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడున్నర ఏళ్ళు మంత్రిగా కొనసాగిన ఈటల నియోజకవర్గానికి చేసింది శూన్యమని చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా అభివృద్ధి చెందారు తప్ప ప్రజలకు ఏమీ ఒరగలేదన్నారు. కావున ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. గత ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలకు రుణాలు ఇప్పిస్తానని చెప్పిన ఈటల మోసం చేశారని గుర్తుచేశారు.ఆయనకు ఓటు వేస్తే మళ్లీ మనం మోసపోయినట్లే అని విమర్శించారు. ప్రజలు ఆత్మగౌరవంగా జీవించాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

సీఎం సమక్షంలో రేపు టీఆర్ఎస్‌లోకి..

సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీలో చేరుతున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.

హుజూరాబాద్ ప్రజలకు కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి..

Advertisement

Next Story