- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లెక్కల్లో గందరగోళం.. భూముల ‘డిజిటల్’ సర్వేపై అయోమయం..
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం చేపట్టనున్న వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే విధి విధానాలపై రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. సర్వేకు ముందు క్షేత్రస్థాయి సమస్యలపై అధ్యయనం చేస్తే బాగుండేదంటున్నారు. రెవెన్యూ రికార్డులు, క్షేత్రంలో హద్దులు ఉంటేనే డిజిటల్సర్వే సజావుగా సాగుతుంది. కానీ రికార్డుల్లో లెక్కలు తేలలేదు. ఇక ఎవరి భూమి ఎక్కడ, ఎంత ఉన్నదో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఉన్నది. అన్నింటికీ మించి అసైన్డ్ భూముల్లో గందరగోళం నెలకొంది. పట్టా ఉంటే భూమి లేదు. భూమి ఉంటే పట్టాలు లేవు.
ఈ రెండూ ఉన్నా విస్తీర్ణంలో భారీ తేడా ఉంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో సర్వే మొదలుపెడితే భూమి లేకుండా కేవలం పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వారంతా తమ భూమిని చూపించాలని డిమాండ్చేస్తారు. అప్పుడేం చేయలో పాలుపోవడం లేదని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారొకరు అభిప్రాయపడ్డారు. దీనిని సజావుగా పూర్తి చేయాలంటే సర్వేకు చట్టబద్ధత కలిగించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు. గతంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన భూ భారతి పైలట్ ప్రాజెక్టు ఫెయిల్యూర్స్ కి కారణాలేమిటో సీనియర్ ఐఏఎస్ అధికారులంతా సీఎం కేసీఆర్‌కు వివరిస్తే బాగుండేదన్న అభిప్రాయపడుతున్నారు.
సర్వే నంబర్లతోనే సేల్డీడ్లు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమకు సాగు భూమి ఉండాలన్న ఆకాంక్ష పెరిగింది. అందరి పేరిటా భూమి ఉండేటట్లుగా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే 2017 తర్వాత రెండు నుంచి 10 గుంటల భూమి కొనుగోళ్లు, క్రయ విక్రయాలు, మ్యుటేషన్లు జోరుగా సాగుతున్నాయి. ఆఖరికి రెండు గుంటల భూమైనా తన పేరిట ఉంటే బాగుంటుందని కోరుకునే వారి సంఖ్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన చిన్న కమతాల లావాదేవీల సంఖ్య అత్యధికంగా ఉంది. చాలా డాక్యుమెంటులో సర్వే నంబరు, సబ్డివిజన్వేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
సరిహద్దులు మాత్రం తను కొనుగోలు చేసిన, పొందిన భూమికి పేర్కొనలేదు. మొత్తం సర్వే నంబరు, అంతకు ముందు ఆ భూమికి ఉన్న సరిహద్దులనే డాక్యుమెంటులో రాశారు. సదరు భూమి అక్కడెక్కడో ఉందన్నట్లుగానే కనిపిస్తుంది. ఒక్కో సర్వే నంబరు 100 విభాగాల వరకు మారింది. ఇప్పుడీ డిజిటల్సర్వే వారి భూములు ఎక్కడెక్కడన్న విషయాన్ని తేల్చాలంటే ఎంత కష్టమవుతుందో అంచనా వేయొచ్చునని రెవెన్యూ అధికారొకరు ‘దిశ’తో అన్నారు. ఇప్పుడా చిక్కుముళ్లు విప్పడం గగనమేనన్నారు.
తేలని అసైన్డ్ లెక్కతో కష్టమే..
రాష్ట్రంలో అసైన్డ్ భూముల లెక్క తేల్చాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని పురమాయించి ఏడేండ్లు కావస్తున్నది. కానీ వివాదాలు, క్షేత్ర స్థాయి పరిస్థితి, రికార్డుల్లో గందరగోళం, చేతులు మారిన వైనం వంటి ప్రక్రియల వల్ల లెక్క తేలలేదు. అసైన్డ్ భూముల పంపకాల్లో అనేక లోపాలు దర్శనమిస్తున్నాయి. సర్వే నంబరులోని విస్తీర్ణం కన్నా రెట్టింపు పంపిణీ చేసిన ఉదాహరణలు ఉన్నాయి. 40, 50 ఏండ్ల కిందటే తీసుకున్న వారున్నారు. వాళ్లు ఎప్పటి నుంచో రికార్డుల్లో నమోదై ఉన్నారు. ఆ వివరాలను, పంపిణీ చేసిన మొత్తం విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం పేదలకు అదే భూమిని మళ్లీ పంపిణీ చేసి పట్టాలు చేతిలో పెట్టారు.
అయితే వారికి హద్దులు చూపించకపోవడంతో పట్టాలు మాత్రమే మిగిలాయి. ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం కంటే అధికంగా ఉండడంతో ధరణి పోర్టల్ అంగీకరించడం లేదు. చాలా మందికి కొత్త పట్టాదారు పుస్తకాలను జారీ చేయలేదు. ఇప్పుడీ సర్వే చేసేటప్పుడు చేతిలో పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన వారంతా తమకు భూమి చూపించాలని డిమాండ్‌చేస్తే ఎలా? అని ఓ రెవెన్యూ అధికారి సందేహం వ్యక్తం చేశారు. క్షేత్రంలో లేని భూమిని తీసుకురావడం అసాధ్యమన్నారు.
అందరి ఆమోదం తప్పనిసరి
డిజిటల్సర్వే చేసేటప్పుడు గ్రామ సభ నిర్వహించడం, ప్రతి పట్టాదారుడికి నోటీసులు జారీ చేయడం తప్పనిసరి. అయితే రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తున్నది. వీఆర్వో వ్యవస్థ రద్దయిన తర్వాత రెవెన్యూ ఇన్ స్పెక్టర్, వీఆర్ఏలు మాత్రమే ఉన్నారు. ఈ హక్కుదారులందరికీ నోటీసులు అందజేసే ప్రక్రియలో ఏ ఒక్కరికీ మిస్సయినా సర్వే నిలిచిపోతుంది. అలాగే ఏ ఒక్కరు అభ్యంతరం వ్యక్తం చేసినా చెల్లకుండాపోతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోతే హక్కుదారులంతా అంగీకరించే అవకాశం లేదు. ప్రతి రెవెన్యూ గ్రామంలోనూ 15 నుంచి 20 శాతం సర్వే నంబర్లలో లెక్కల చిక్కులు యథాతథంగా ఉన్నాయని అంచనా. ఈ విషయాలన్నీ సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారులు వివరించలేదని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.