గెలుపుపై టీఆర్ఎస్‌లో ఆందోళన

by Anukaran |   ( Updated:2020-10-31 06:22:54.0  )
గెలుపుపై టీఆర్ఎస్‌లో ఆందోళన
X

అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతల్లో బుగులు నెలకొంది. త్వరలో జరిగే వరంగల్ బల్దియా ఎన్నికల్లో గెలుపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల పెండింగ్, వరదల ఎఫెక్ట్‌.. పార్టీపై పడిందని మాట్లాడుకుంటున్నారు. కాగా, ఎలాగైనా సీటు సాధించి, గెలుపొందాలని బడా నేతల చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. అధికార పార్టీపై వ్యతిరేఖతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.

దిశ ప్రతినిధి, వరంగల్:త్వరలో జరగనున్న వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుపై టీఆర్ఎస్ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా మళ్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో అడుగు పెట్టాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో కొంతమంది నాయకులు తమ గాడ్ ఫాదర్‌లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఒకవేళ పార్టీ నుంచి టికెట్ దక్కకుంటే ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఆసరాగా చేసుకుని కార్పొరేషన్‌పై జెండా ఎగుర వేయాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.

ఈ సారి కలిసొచ్చేనా?

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 58 డివిజన్లు ఉన్నాయి. టీఆర్ఎస్ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 53 స్థానాల్లో గులాబీ గెలుపొందగా, కాంగ్రెస్ 4, బీజేపీ 1 స్థానంతో సరిపెట్టుకున్నాయి. కాలక్రమేణా ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరారు. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపుగా ఇతర పార్టీల్లోని బడా నేతలు గులాబీ గూటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్‌కు స్మార్ట్ సిటీ, మహానగరం హోదాలతో పాటు హృదయ్ పథకానికి ఎంపికైనప్పటికీ ఆశించిన మేర అభివృద్ధి జరగలేదనే విమర్శలు ఉన్నాయి. కేంద్రం నుంచి సుమారు రూ.88 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చు చేయలేదనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతూ వస్తోంది.

పార్టీపై వరదల ఎఫెక్ట్..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. కొన్ని కాలనీలు నీట మునిగగా.. ప్రధాన రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాకు గురవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని బాధితులు మొత్తుకున్నారు. చెరువులు, నాలాల కబ్జాల వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రజలంతా గుర్రుగా ఉన్నారు. తక్షణమే ఎన్నికలు వస్తే మాత్రం టీఆర్ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వర్గపోరు..?

అధికార పార్టీలో వర్గపోరు నడుస్తోంది. ప్రధానంగా ముఖ్య నేతల మధ్య సమన్వయం కొరవడినట్లు ప్రచారం జరుగుతోంది. నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యేలు సమన్వయం చేయడంలో విఫలమయ్యారనే చర్చ నడుస్తోంది. తూర్పు నియోజకవర్గంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్ గతంలో మేయర్‌గా పనిచేశారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై పార్టీలో సగంమంది వ్యతిరేకించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, సీనియర్ నాయకుడు అచ్చా విద్యాసాగర్ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. తీరా నరేందర్‌కు రావడంతో నిరశకు గురయ్యారు. దీంతో ముఖ్య నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది. గ్రేటర్ ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

భూ వివాదాలపై..

పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తమ్ముడు విజయ్ భాస్కర్ ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆయనపై భూ వివాదాల ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రజల్లో వీరిపై వ్యతిరేకత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆనాటి నుంచి కాంగ్రెస్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్‌లో నెలకొన్న విభేదాలను తమకు అనుకూలంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జెండా ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Advertisement

Next Story