నేడు, రేపు నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్

by srinivas |
నేడు, రేపు నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్
X

గుంటూరు జిల్లాలో కరోనా కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న గుంటూరు అర్బన్, నరసరావు పేటలపై అధికారులు దృష్టి సారించారు. దీంతో నేడు రేపు నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు.

గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 254 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వాటిలో 145 కేసులు గుంటూరు పట్టణంలో నమోదైతే మరో 109 కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదైనవి. వాటిల్లో కూడా 75 కేసులు కేవలం నరసరావుపేటలోనే నమోదు కావడం విశేషం. దీంతో ఈ రెండు రోజులు నరసరావుపేటలో లాక్‌డౌన్ విధించి, కరోనా మూలాలు శోధించాలని అధికారులు నిర్ణయించారు.

ఈ క్రమంలో నరసరావుపేట చుట్టూ పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ రెండు రోజులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర వాహనాలను మాత్రమే.. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే 14 రోజుల క్వారంటైన్‌కు పంపుతామని భయపెడుతున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులకు సంబంధించిన 920 ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.

ఇంకా 200 మందికిపైగా గుర్తించి క్వారంటైన్‌ చేయాల్సి ఉండగా, వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇందుకోసం ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలతో కూడిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు పోలీసుల కళ్లుగప్పే వారిపై డ్రోన్ నిఘా పెట్టారు. ప్రధానంగా వరవకట్టు ప్రాంతంలోని వారిపై డ్రోన్‌లు కన్నేసి ఉంచాయి. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో భద్రత కోసం మూడు ప్లటూన్ల ప్రత్యేక బృందాలు, ఎనిమిది మంది సీఐలు, 14మంది ఎస్‌ఐలు, 10 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు గస్తీ కాస్తుండగా, వారికి అదనంగా మరో 50 మంది కానిస్టేబుళ్లను అధికారులు కేటాయించారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులుంటే కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేస్తే పరిష్కరిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Tags: guntur district, narasaraopeta, police security, lockdown, Coronavirus, Covid-19

Advertisement

Next Story