'దళిత'పై కేసీఆర్‌కు ఊహించని షాక్

by Shyam |   ( Updated:2021-08-05 21:37:26.0  )
cm-kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకం పేరును మార్చాలని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు వెళ్ళింది. ‘దళిత‘ అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం వాడవద్దంటూ 2018 మార్చి నెలలోనే అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసిందని, అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆ పదాన్నే పథకానికి టైటిల్‌గా పెట్టారని తెలంగాణ మాల సంక్షేమ సంఘం ఆ ఫిర్యాదులో పేర్కొన్నది. ఇప్పటికీ ‘దళిత‘ పదంపై అధికారికంగానే నిషేధం లాంటి విధానం అమలవుతున్నదని, ఇప్పుడు పథకానికి ఆ పదాన్ని పెట్టడం ద్వారా కేసీఆర్ మరో రూపంలో వివక్షకు ఆస్కారం కల్పిస్తున్నారని సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘దళిత’ అనే పదం ఉచ్చరించగానే అంటరానివారు అనే భావం ఏర్పడుతుందని, అందువల్ల ఆ పదాన్ని తొలగించాలని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్డర్‌కి ఇచ్చిన ఫిర్యాదులో రాంప్రసాద్ నొక్కిచెప్పారు. ఈ పథకం పేరును ‘అంబేద్కర్ బంధు‘గా మార్చాలని సూచించి ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసి పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. గడువులోగా స్పందించని పక్షంలో నిబంధనలకు అనుగుణంగా కమిషన్ నిర్ణయం తీసుకుని సమన్లు జారీ చేస్తుందని హామీ ఇచ్చారని రాంప్రసాద్ తెలిపారు.

ఇదే విషయమై ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ, ‘దళిత’ అనే పదాన్ని కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ గతంలోనే వ్యవహారికం నుంచి తొలగించిందని, అన్ని రాష్ట్రాలూ ఈ పదాన్ని అధికారికంగా వాడవద్దంటూ 2018 మార్చి 15న లేఖలు రాసిందని గుర్తుచేశారు. ఈ సూచనను సవాలు చేస్తూ కొద్దిమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారని, కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎత్తిపట్టిందని గుర్తుచేశారు. ఈ పదాన్ని వినియోగించవద్దంటూ పేర్కొన్నా తెలంగాణ ప్రభుత్వం ఎలా వాడుతుందని ఆయన ప్రశ్నించారు. ‘దళిత’ అనే పదాన్ని తీసివేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, అందువల్లనే జాతీయ కమిషన్‌ని ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘దళితబంధు‘ జీవో కాపీని కూడా కమిషన్‌కు అందజేశామని, సానుకూల స్పందన వచ్చిందని రాంప్రసాద్, అతని తరపు న్యాయవాది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కి ఫోన్ చేశారని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. వ్యవహారిక పదాల జాబితా నుంచి ‘దళిత’ పదాన్ని తొలగించినా తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుకు ఎలా వాడుతుందని వైస్ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ సీఎస్ 15 రోజుల్లో జవాబు ఇవ్వాల్సిందిగా కమిషన్ వైస్ చైర్మన్ లేఖ రాసినట్లు తెలిపారు. ఒకవేళ స్పందన రానిపక్షంలో నోటీసులు జారీ చేస్తామని, నిర్ణీత సమయంలో స్పందించకపోతే నిబంధనలకు అనుగుణంగా సమన్లు జారీ చేస్తామని కూడా వైస్ చైర్మన్ తమకు చెప్పారని రామ్ ప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story