- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు ఆరు.. ఒక్కో స్థానానికి పదుల సంఖ్యలో పోటీ. అధికార పార్టీకి చెందిన స్థానాలు కావడం… అసెంబ్లీ ఎన్నికల సమయంలో, వివిధ పార్టీలకు చెందిన నేతలు చేరిక సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని, మంచి పదవులు ఇస్తానని హామీలు ఇచ్చారు. వారితో పాటు ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. పార్టీని నమ్ముకొని పదవుల కోసం ఎదురు చూస్తున్నవారున్నారు. దీంతో తాజా మాజీలలో ఎంతమందికి రెన్యువల్ చేస్తారు… ఎంతమందికి మొండి చెయ్యి చూపుతారు… కొత్తవారికి ఎంతమందికి ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎంపిక కేసీఆర్ కు సవాల్ గా మారిందని చెప్పొచ్చు.
రాష్ట్రంలో మరో ఎన్నికల కోలాహలం మొదలైంది. నిన్నటిదాకా హుజురాబాద్ ఉప ఎన్నిక సందడి నెలకొనగా.. తాజాగా మండలి ఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆశావాహులు టికెట్ కోసం యత్నాలు ప్రారంభించారు. శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగిసింది. వీరంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. ఈ జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. ఈ 6 స్థానాల కోసం పార్టీకి చెందిన నేతలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీలు ఇవ్వగా, మరికొందరు తమకు కేటాయించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉంది. అయితే తక్కువ ఎమ్మెల్సీ స్థానాలు ఉండటంతో ఎవరికి ఇస్తే పార్టీకి లాభం చేకూరుతుందనే విషయంపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. సామాజిక వర్గాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్సీగా ప్రస్తుతం శాసనమండలిలో ఎవరైనా ప్రతినిధ్యం వస్తుంటే ఆ వర్గానికి కాకుండా మరో వర్గానికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను పార్టీ రూపొందిస్తుండటంతో ఈ ఎమ్మెల్సీ స్థానాలు కీలకం కానున్నాయి. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఖాళీ స్థానాల భర్తీలో తమకు అవకాశం దక్కుతుందని గత నాలుగు నెలలుగా నేతలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎన్నిక జూన్ లోనే జరుగుతుందని భావించినప్పటికీ కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. తమకు గతంలోనే కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారని ఇక టికెట్ విషయంలో ఎలాంటి ఢోకా లేదని పలువురు నేతలు పేర్కొంటున్నారు. అయితే 6 స్థానాలకు సుమారు 17 మందికి పైగా హామీలు ఇవ్వగా ఎవరికి ఇస్తారో అనేది చర్చనీయాశంగా మారింది. ఇదిలా ఉంటే ఒక్కొ ఉమ్మడి జిల్లా నుంచి డజన్ కు పైగా ఆశావాహులు ఉన్నారు.
రెన్యూవల్ పై గుత్తా, కడియం ఆశలు…
ఎమ్మెల్సీగా రెండేళ్లే ప్రాతినిధ్యం వహించడంతో మరోసారి పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి రెన్యువల్ చేస్తారనే ఆశాభావంతో ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం, రాజకీయ అనుభవం ఉండటం కలిసి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఆయన సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి ఈ సారి నార్మాక్స్ చైర్మన్ నుంచి వైదొలగడం రాజకీయ పరిణామాల్లో భాగమని నేతలు పేర్కొంటున్నారు. కడియం శ్రీహరికి కేసీఆర్ తో సానిహిత్యం, సీనియర్ నేతగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో రెండోసారి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా గుత్తా, కడియంలకు అవకాశం లభిస్తుందని సమాచారం. తాజాగా పదవీకాలంలో ముగిసిన వారిలో బొడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్, ఫరీదుద్దీన్ లు ఇప్పటికే రెండు టర్ములు ప్రాతినిధ్యం వహించారు. ఆకుల లలిత కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నికై టీఆర్ఎస్ లో చేరారు. ఆ సమయంలో మరోసారి అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. మహిళ కావడంతో మరి అధిష్టానం అవకాశం ఇస్తుందో లేదో చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఉమ్మడి పది జిల్లాల నుంచి ఎమ్మెల్సీ స్థానం కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులు వీరే…
=ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి క్యామ మల్లేశం, మేడ్చల్ కు చెందిన రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. వీరు గాక నాగేందర్ గౌడ్, పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి టికెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం.
=హైదరాబాద్ నుంచి ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ సలీం, బండి రమేష్, పీఎల్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నింస్తుండగా, మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్ కు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
=వరంగల్ ఉమ్మడి జిల్లాలో నాగుల వెంకటేశ్వర్లు, మధుసూదనాచారి, కడియం శ్రీహరి లకు టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, సుందర్ రాజు, టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్ చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, గుడిమల్ల రవికుమార్ టికెట్ ను ఆశిస్తున్నారు.
=నల్లగొండ జిల్లాలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, చేనేత వర్గం నుంచి కర్నాటి విద్యాసాగర్ కు కేసీఆర్ హామీ ఇవ్వగా, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, చాడ కిషన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, చకిలం అనిల్ కుమార్, ఎంసీ కోటిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వేముల వీరేశం, శశిధర్ రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, దూదిమెట్ల బాల్ రాజుయాదవ్, వేమిరెడ్డి నర్సింహా రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
=కరీంనగర్ జిల్లాకు చెందిన ఎల్. రమణ, ఇనుగాల పెద్దిరెడ్డిలకు కేసీఆర్ హామీ ఇచ్చారు. టి. సంతోష్ కుమార్, పిట్టల రవీందర్, ఎమ్మెల్సీ టికెట్ ను ఆశిస్తున్నారు.
=నిజామాబాద్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితతో పాటు మాండవ వెంకటేశ్వర్లు, అరికెళ్ల నర్సింహారెడ్డి, రాజారాం యాదవ్, ముజీబుద్దిన్, ఈగ గంగారెడ్డిలకు కేసీఆర్ హామీ ఇచ్చారు.
=ఖమ్మం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు ఎమ్మెల్సీ పదవికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నర్ కోటా కింద వస్తుందని ఆశించినప్పటికీ ఇవ్వలేదు. అయితే వీరు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని సైతం ఆశిస్తున్నట్లు తెలిసింది.
=ఆదిలాబాద్ జిల్లా నుంచి సీవీరావు, సత్యనారాయణగౌడ్, పరిగెల నాగేశ్వర్, గోడం నగేష్ టికెట్ కోసం యత్నిస్తున్నట్లు సమాచారం.
=మెదక్ జిల్లా నుంచి ఫరీదుద్దీన్, దేశపతి శ్రీనివాస్, గ్యాదరి బాలమల్లు టికెట్ ఆశించడంతో పాటు ఇప్పటికే యత్నాలు ముమ్మరం చేశారు.
=మహబూబ్ నగర్ జిల్లా నుంచి జనార్దన్, శివకుమార్, జూపల్లి కృష్ణారావు నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.