కమ్యూనిటీలోకి కరోనా.. ఆందోళనలో నగర ప్రజలు

by Shyam |   ( Updated:2020-07-24 04:01:45.0  )
కమ్యూనిటీలోకి కరోనా.. ఆందోళనలో నగర ప్రజలు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా వైరస్ వేగంగా విస్తరించే కమ్యునిటీ దశకు చేరుకోవడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలంటే జంకుతున్నారు. కంటికి కన్పించని వైరస్ కావడంతో ఎవరికి ఉందో , ఎవరికి లేదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఉదయం వరకు కలిసి ఉన్న వారు సాయంత్రానికి జ్వరం బారిన పడడం, వైద్య పరీక్షలకు వెళ్తే పాజిటివ్ అని వస్తుండడంతో వారిని కలిసిన వారి బాధ చెప్పనలవి కాని విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆత్మీయులను కలిసి విషయం చెప్పి సలహాలు కోరుతున్నారు. కొంత మంది ఏకంగా వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం జంట నగరాలలో ఇలాంటివి చాలా చోటు చేసుకుంటున్నాయి.

రోజుల వ్యవధిలో మృతి చెందుతున్న కరోనా బాధితులు…

వయస్సు తో ప్రమేయం లేకుండా కరోనా బారిన పడిన వారు రోజుల వ్యవధి లోనే మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి సంఘటనలో నగరంలో కో కొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి మొదట్లో 60 యేండ్ల పై బడిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే అదంతా వట్టిదే నని ఇటీవల చోటు చేసుకున్న మరణాలు రుజువు చేస్తున్నాయి. కేవలం రోజుల వ్యవధి లో కరోనా పాజిటివ్ వచ్చిన వారు కన్పించని లోకాలకు వెళ్లి పోతున్నారు. మృతుల్లో అన్ని వయస్సుల వారు ఉంటుండడం చూస్తోంటే వయస్సుతో ప్రమేయం ఉండదనేది స్పష్టమౌతుండగా ప్రజలు వయస్సుతో సంబంధం లేకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కల్గించే స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం ప్రతి నిత్యం కరోనా కేసుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు. ప్రతి రోజు పదిహేను వందల వరకు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదౌతుండగా వాటిల్లో సగానికి పైగా గ్రేటర్ పరిధిలో ఉంటుండడం గమనార్హం. జూలై 1వ తేదీ నుండి ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్రంలో రోజుకు సగటున 1,499 చొప్పున 34,486 కేసులు నమోదు కావడం చూస్తోంటే కరోనా ఎంతలా విజ‌ృంభిస్తుందో ఇట్లే అర్థం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed