ఆ బాధ్యత మీదే: కలెక్టర్ ధర్మారెడ్డి

by Shyam |
ఆ బాధ్యత మీదే: కలెక్టర్ ధర్మారెడ్డి
X

దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు… పంటమార్పడి విధానంపై మెదక్ జిల్లాలోని రైతులను చైతన్యపర్చాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం సూచించిన మేరకు రైతులకు పంటమార్పిడి విధానంపై వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో)లు వివరించాలని సూచించారు. ముఖ్యంగా ఏఈవోలు రైతుల ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి పంట సేద్యంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తున్నారనే వివరాలను ఏఈవోలు తమ వద్ద ఖచ్చితంగా సేకరించుకొని ఉంచుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో క్రాప్ ఎన్యూమరేషన్ జరగాలని… నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నాలుగుదై రోజుల్లోనే పూర్తిస్థాయిలో క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. నియంత్రిత పద్దతిలో పంటలను సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాల్సిన బాధ్యత ఏఈవోలదేనన్నారు. రైతులందరూ ఒకే రకమైన పంట వేస్తే దిగుబడి తగ్గిపోవడంతో పాటు డిమాండ్ కూడా లేకుండా పోతుందని, ఈ పరిస్థితిని నివారించడానికే ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివరించాలన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు పంటలు సాగు చేయడం వల్ల నష్టం జరగదని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు వరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని… ఎక్కువగా డిమాండ్ ఉన్న తెలంగాణ సోనా రకం వేసుకోవాలని… 6.4 ఎం.ఎం. సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయంగా బాస్మతి రైస్ పంటను కూడా సాగు చేయాలని సూచించారు. మెదక్ జిల్లా వారీగా అగ్రికల్చర్ కార్డును రూపొందించాలని, దాని ప్రకారమే పంటల సాగును చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో అనేక ఆధునిక, సాంకేతిక పద్ధతులు, కొత్త వంగడాలు వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకొని సాధారణ రైతులు సైతం ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా వ్యవసాయ శాఖ అధికారులపైనే ఉందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురామ్నాయక్, జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షులు టి. సోములు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story