లేడీ కలెక్టర్ ట్వీట్ వైరల్.. హుజూరాబాద్ ఓటింగ్‌పై ఎఫెక్ట్!

by Anukaran |   ( Updated:2021-10-27 00:44:57.0  )
Valluri Kranthi
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్​ఉపఎన్నికపై వ్యాక్సిన్​ప్రభావం పడేలా కనిపిస్తోన్నది. టీకా తీసుకోనోళ్లకు ప్రభుత్వ పథకాలు బంద్​ చేస్తామంటూ కొందరి అధికారుల కామెంట్లు, ప్రకటనలు టీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నది. డోసులు పొందితేనే రేషన్, పింఛన్లు ఇస్తామని చేస్తున్న ప్రచారాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారనున్నాయి. వ్యాక్సిన్​ముఖ్యమే అయినప్పటికీ, పేదలు లబ్ధిపొందే స్కీంలను ఎలా ఆపుతారంటూ? పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక సోషల్​ మీడియా వేదికగా ఎంతో మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేస్తున్నారు.

దీనికి తోడు గద్వాల కలెక్టర్​వల్లూరు క్రాంతి చేసిన ట్వీట్​కూడా సంచలనం రేకిత్తిచ్చింది. దీంతో పాటు స్వయంగా హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్ జి.శ్రీనివాసరావు డోసు తీసుకోనోళ్లకు రేషన్, ఆసరా బంద్ చేస్తామని చెప్పినట్లు పలు మీడియాల్లో వార్తలు ప్రసారం అయ్యారు. కొద్ది క్షణాల్లోనే ఆయన వాటిని ఖండిస్తూ ప్రకటనను విడుదల చేసినా, క్షేత్రస్థాయిలో అదే పరిస్థితి ఉన్నట్లు పలు గ్రామాల్లోని అధికారులు చెబుతున్నారు. స్వయంగా అధికారులు చేస్తున్న ప్రకటనలతో హుజూరాబాద్‌తో పాటు జిల్లాల్లోని ప్రజలు షాక్​అవుతున్నారు.

అయితే రేషన్, పింఛన్లు నిలిపివేస్తామని వార్నింగ్‌లు ఇస్తున్న అధికారులు, కలెక్టర్లపై మంగళవారం సీఎస్ సోమేష్​కుమార్​ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను మీరెలా నిర్ణయిస్తారంటూ సీరియస్​అయినట్లు తెలిసింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఆసీఫాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి ఆదేశాలు లేకపోయినా గత పదిహేను రోజుల నుంచి వ్యాక్సిన్​వేసుకుంటేనే రేషన్​విధానం నడుస్తున్నట్లు క్షేత్రస్థాయి హెల్త్ కేర్ వర్కర్లు చెప్పడం గమనార్హం.

వ్యాక్సినేషన్ స్పీడప్ అయ్యేందుకే ప్రజలను ఈ విధంగా భయపెడుతున్నామని, కానీ ఎక్కడా రేషన్, పింఛన్లను ఆపలేదని కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ అధికారి ‘దిశ’కు తెలిపారు. టీకా పొందిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే స్కీంలను లబ్ధిదారులకు ఇచ్చేస్తున్నామని మరో అధికారి చెప్పారు. కేవలం ప్రజల రక్షణ కొరకు మాత్రమే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని గ్రేటర్​హైదరాబాద్‌కు చెందిన ఇంకో ఆఫీసర్ తెలిపారు.

కలెక్టర్ల రివ్యూలలోనే నిర్ణయాలు…

కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోని వారికి ఆసరా పెన్షన్, రేషన్‌ను ఆపేయాలని సోమవారం గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పెషల్ అధికారులకు ఆదేశించారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రతీ జిల్లాలో అంతర్గతంగా ఇలాంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కేవలం గద్వాల జిల్లా కలెక్టర్ విషయం మాత్రమే బయట పడింది. తక్కువ వ్యాక్సినేషన్ అయిన గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు స్వయంగా అధికారులే చెప్పడం గమనార్హం. ఇప్పటికే ఆయా గ్రామాల్లో రేషన్, పింఛన్ లబ్ధిదారుల లిస్టును కూడా తయారు చేసినట్లు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. దీంతో వ్యాక్సిన్​ కోసం పథకాలు ఆపుతామని బెదిరిస్తున్న అధికారులు, రాబోయే రోజుల్లో ఓట్ల కోసం ఏదైనా చేస్తారేమోనని ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

షాకింగ్ న్యూస్.. సెకన్‌కు ఒకరికి సోకుతున్న వ్యాధి.. నిర్లక్ష్యం చేస్తే డేంజర్

Advertisement

Next Story

Most Viewed