ముఖ్యమంత్రి ఆస్తులు భారీగా తగ్గాయట..

by Shamantha N |
ముఖ్యమంత్రి ఆస్తులు భారీగా తగ్గాయట..
X

దిశ, వెబ్‌డెస్క్ : సెంట్రల్, స్టే‌ట్‌లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎలక్షన్‌లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన ప్రజాప్రతినిధి ఎవరైనా తమ ఆస్తులు తగ్గాయని అఫిడవిట్‌లో పేర్కొన్న దాఖలాలు కూడా చాలా అరుదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పటివరకు రాజకీయాల్లో పోటీ చేసిన నేతల ఆస్తులు పైపైకి పోవడం తప్ప కిందకు పోయిన ఘటనలు చాలా తక్కువ. ప్రస్తుత రాజకీయాలు డబ్బుతో ముడివేసుకున్నాయన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయాలంటే దేశంలో ఒక్కో నియోజకవర్గానికి ప్రచారం నిమిత్తం ఇంత ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిర్దేశిస్తే.. అభ్యర్థులు దానికి డబుల్ నుంచి ట్రిపుల్ ఖర్చు చేయడం అనవాయితీగా వస్తోంది. అందులోనూ ఎంపీ స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి రూ. కోట్లలో డివైడ్ చేసి మరి ఖర్చు చేస్తుంటారు.

ఎలాగైనా ఎన్నికల్లో గెలిస్తే చాలు. ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో వారు ఖర్చు చేసిన ప్రతీ రూపాయికి రెండు లేదా మూడింతలు సంపాదిస్తుండటం మనం చూస్తునే ఉన్నాం. గత ఎన్నికల్లో ప్రకటించిన అఫిడవిట్‌లోని ఆస్తుల వివరాలను, ప్రస్తుతం పోల్చి చూసినపుడు ఒక్కో లీడర్ వెనకేసిన ఆస్తుల వివరాలు చూస్తే షాక్ అవ్వడం ఓటర్ల వంతు అవుతోంది. బడా నేతలను స్పూర్తిగా తీసుకుని ప్రస్తుతం గల్లీ లీడర్లు కూడా అదే రీతిలో సంపాదిస్తున్నారు. మరికొందరైతే కేవలం డబ్బు సంపాదన, పలుకుబడి కోసం రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. రాజకీయ నాయకులు సంపాదన ఎంతంటే కొన్ని తరాలు ఈజీగా బతికేయొచ్చు. ఇలాంటివి అవినీతి నిరోధక శాఖ జరిపే దాడుల్లో అప్పుడప్పుడు వెలుగుచూస్తుండగా, మరికొన్ని పొలిటికల్ ప్రెషర్ వలన బాహ్య ప్రపంచానికి తెలియదు.

అలాంటిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రకటించిన అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఆస్తుల విలువ రూ.30.45 లక్షలు ఉండగా.. 2021లో జరిగే ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం మమతా బెనర్జీ రూ.16.72 లక్షలుగా చూపించింది. అనగా, గతేడాదితో పోలిస్తే రూ.14 లక్షల ఆస్తులు తగ్గినట్లు చూపించారు. దీని ప్రకారం ఆమె వద్ద ప్రస్తుతం రూ.16.72లక్షల చర ఆస్తులు, రూ.43,837 విలువైన తొమ్మిది గ్రాముల ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇదిలాఉండగా, రెండు పర్యాయాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు తగ్గినట్లు ప్రకటించడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed