మంత్రి జాకీర్‌పై దాడి పెద్ద కుట్ర : మమతా బెనర్జీ

by Shamantha N |   ( Updated:2021-02-18 06:13:18.0  )
CM Mamata Banerjee
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కార్మిక శాఖ సహాయ మంత్రి జాకీర్ హొస్సెయిన్‌పై దాడి పెద్ద కుట్ర అని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పక్కా పథకం ప్రకారమే రాష్ట్ర మంత్రి జాకీర్, ఆయన మద్దతుదారులపై బుధవారం బాంబు విసిరి దాడి చేశారని అన్నారు. ఇతర పార్టీలోకి చేరేలా ఒత్తిడి చేయడంలో భాగంగానే ఈ దాడిని చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినవారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ. 1 లక్షల పరిహారాన్ని అందజేయనున్నట్టు ప్రకటించారు. ‘మంత్రి జాకీర్ హొస్సెయిన్, ఆయన అనుయాయులు అందరిలాగే ట్రైన్ ఎక్కడానికి వెళ్లారు. కానీ, వారిపై క్రూడ్ బాంబ్ దాడి జరిగింది.

రిమోట్ ద్వారా ఈ పేలుడుకు పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే, ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతున్నది’ అని అన్నారు. ముర్షిదాబాద్‌లోని నింతితా రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అనంతరం వారిని చికిత్స కోసం ఎస్ఎస్‌కేఎం హాస్పిటల్‌కు తరలించారు. ఈ హాస్పిటల్ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించినతర్వాత సీఎం మాట్లాడుతూ, ‘రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఒక్క పోలీసు లేరు. లైట్లు వెలగడం లేదు. రాష్ట్రానికి పాత్ర లేని రైల్వే స్టేషన్‌లో ఈ దాడి జరిగింది. ఇది పెద్ద కుట్ర. కానీ, రైల్వే పెద్దగా పట్టించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. భద్రతాపరమైన లోపాలుండగా రైల్వే బాధ్యతవహించకుండా ఎలా తప్పించుకుంటుంది’ అని అడిగారు.

Advertisement

Next Story

Most Viewed