రూ.25 లక్షలకు పేరుకుపోయిన ప్రగతి భవన్ ప్రాపర్టీ ట్యాక్స్

by Anukaran |   ( Updated:2021-07-05 23:31:15.0  )
Pragathi Bhavan property tax
X

దిశ, సిటీ బ్యూరో : అభివృద్ది, సంక్షేమ మంత్రం జపించే పాలకులే పన్నులను ఎగవేస్తున్నారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి అధికార నివాసమైన బేగంపేటలోని ప్రగతి భవన్ జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను లక్షల్లో పేరుకుపోయింది. ప్రజలు చెల్లించే పన్నులతోనే నడిచే ప్రభుత్వాన్ని నడిపే పెద్దలకు వారి హోదాను బట్టి వారి గౌరవానికి తగిన విధంగా బస కల్పించేందుకు ప్రభుత్వమే నిర్మించి, నిర్వహించే ప్రగతి భవన్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి పడటం, అది లక్షల్లో పేరుకుపోవటం ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం, ఆయన కుటుంబం నివాసముంటున్నప్పటికీ వారు తమ సొంత డబ్బుుతో ఈ ప్రాపర్టీ చెల్లించనవసరం లేదు. సర్కారు పైసలతోనే ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంది.

జీహెచ్ఎంసీ లోని ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే సర్కిల్ -17లో 6-3-87-/ఏ ఇంటి నెంబరుతో ఉన్న ప్రగతి భవన్ కు జీహెచ్ఎంసీ అధికారులు ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ (పీటీఐఎన్) 1170668303ను కేటాయించారు. చీఫ్ మినిష్టర్ క్యాంపస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్న పేరిట ఉన్న ఈ ప్రగతి భవన్ ఇప్పటి వరకు రూ. 25లక్షల 49 వేల 914 బల్దియాకు బకాయి పడింది. ఈ మొత్తంలో రూ.15లక్షల 12వేల 19 పాత బకాయిలున్నాయి. వీటికి గాను జీహెచ్ఎంసీ ప్రతి ఏటా విధించే రెండు శాతం వడ్డీ మొత్తం రూ.5లక్షల 28వేల 90 ఉన్నాయి. అసలు పన్నును వసూలు చేయలేని బల్దియా అధికారులు ప్రగతి భవన్ పన్ను బకాయిలకు మిత్తీని వేయటంలో తమ ప్రేమను ప్రదర్శించారు.

2018 నుంచి బకాయిల వివరాలివి

ఆర్థిక సంవత్సరం ట్యాక్సు(రూ.లలో..) మిత్తీ(రూ.లలో..) మొత్తం

2018-19 1,91,794 34,524 2,26,318
2018-19 2,64,045 1,58,427 4,22,472
2019-20 2,64,045 1,26,742 3,90,787
2019-20 2,64,045 95,056 3,59,101
2020-21 2,46,045 63,371 3,27,416
2020-21 2,64,045 31,675 29,5730
2021-22 5,28,090 5,09,805 25,49,914

ప్రగతి భవన్ అంటే అధికారులకెంత ప్రేమో

ప్రగతి భవన్ అంటే బల్దియా అధికారులు ప్రత్యేక ప్రేమను కనబరుస్తున్నారు. 2018 నుంచి పైసా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని ప్రగతి భవన్ వార్షిక ఆస్తి పన్ను మీద విధించాల్సిన మిత్తీని చాలా వరకు తగ్గిస్తూ వచ్చారు. అసెస్ మెంట్ చేసిన నాటి నుంచి అసలు పన్ను చెల్లించకుండా పేరుకుపోయిన బకాయిలు పెరుగుతున్న కొద్ది దానిపై ప్రతి ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల మినహా అంటే జూలై మాసం నుంచి ప్రతి నెల రెండు శాతం మత్తీని వర్తింపజేయాలి. కానీ అధికారులు వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ప్రగతి భవన్ ట్యాక్సుకు జూలై మాసం నడుస్తున్నా, ఇంకా మిత్తీని వర్తింపజేయలేదు. వర్తమాన సంవత్సరం జూలై 5వ తేదీ నాటికి ప్రగతి భవన్ మొత్తం రూ. 15లక్షల12వేల 9 బాకీ పడగా, ఇందుకు 5లక్షల 95వేల 5 మిత్తీగా వేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాస భవనం బల్దియాకు మొత్తం రూ.25లక్షల 49వేల 914 బకాయి పడింది

అభివృద్దిలో పాలకుల భగస్వామ్యం ఉండదా?

సకల సౌకర్యాలతో, సర్వ హంగులతో ఇందులో నివాసముండే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులేమీ వారి సొంత డబ్బుతో ఈ భవన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనవసరం లేదు. సర్కారు నిధులతో మాత్రమే ఈ పన్ను మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. కానీ ఈ భవనంలో నివాసముంటున్న వారికి గానీ, ఈ బంగ్లా మెయింటనెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులకు గానీ సకాలంలో ఆ భవన ఆస్తి పన్ను చెల్లించి మహా నగరాభివృద్దికి తమవంతు సహకారాన్ని అందించాలన్న సోయి లేకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బల్దియా అధికారుల పని తీరు కూడా విచిత్రంగా తయారైంది. పన్ను చెల్లిస్తున్న ఆస్తుల యజమానులు ఏ సంవత్సరాకి ఆ సంవత్సరం పన్ను చెల్లించారా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేసుకుని చెల్లించని పక్షంలో యజమానికి నోటీసులు జారీ చేయటమో, లేక నేరుగా కలిసి వసూలు చేసుకోవటమో చేయాల్సి ఉంది. కానీ ప్రగతి భవన్ ఆస్తిపన్ను బకాయిల విషయాన్ని ప్రస్తావించేందుకే బల్దియా అధికారులు భయంతో వణికిపోతున్నారు. పాలకులైతేనేమీ, సామాన్యులైతేనేమీ, అధికారులైతేనేమీ రూల్ ఫర్ ఆల్ అన్న విషయాన్ని మరిచిపోయి, నియమ నిబంధనలు, చట్టాలు సామాన్యులకేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

సామాన్యులకో న్యాయం..పాలకులకో న్యాయమా?

నగరంలో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు ఒక్క సంవత్సరం ఆస్తి పన్ను చెల్లికుంటే వరుసగా రెడ్ నోటీసులు జారీ చేసి అధికారులు హంగామా చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇళ్ల లో నుంచి సామానులు కూడా జప్తు చేసిన సందర్భాలున్నాయి. మరికొన్ని సందర్భాల్లో ఇంటి ముందు, ఆఫీసుల ముందు చెత్త వేసి పన్ను వసూలు చేసిన అధికారులు పన్ను వసూళ్లలో సామాన్యులకో న్యాయం, పాలకులతో న్యాయాన్ని అమలు చేస్తున్నారా? అని నగరవాసులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed