- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరీశ్ రావుకు తలనొప్పిగా మారిన కేసీఆర్ నిర్ణయం.. ఆ భూములపై మంత్రికి చిక్కులు
దిశ, తెలంగాణ బ్యూరో : “హుజురాబాద్శివారులోని కాకతీయ కెనాల్‌కు కుడి వైపున ఓ సంఘానికి 10 గుంటల భూమిని కేటాయించారు. దానికి సంబంధించిన కాగితాలను ఆ సంఘం పెద్దల చేతుల్లో పెట్టారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేయాలని చెప్పారు. ఏండ్ల నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదని, తమను గుర్తించి, తమ కులానికి భూమి ఇచ్చి, భవనం కట్టుకునేందుకు పైసలిస్తామని చెప్పడంతో సదరు సంఘం సభ్యులు ఎగిరి గంతేశారు. మొత్తానికి కారు గుర్తుకే ఓటు అంటూ నినాదాలు చేశారు. మంత్రి హరీశ్‌రావుకు జై కొట్టారు. గులాబీ వర్గం మొత్తం ఫుల్ హ్యాపీ.” ఇది అక్టోబర్‌లో హుజురాబాద్ఉప ఎన్నికల సందర్భం.
కానీ అక్కడి ప్రస్తుత పరిస్థితి ఇది..
“ఈ భూమి కాకతీయ కాల్వ పరిధి. ఏండ్ల కిందటే రైతుల నుంచి కొనుగోలు చేశాం. కాల్వ పరిధిలో 80 పీట్ల భూమి వరకు మాకు ఎప్పుడైనా అవసరం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాకతీయ కాల్వ సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. 9 వేల క్యూసెక్కుల నీరు వెళ్లేలా పెంచాలనే ఉత్తర్వులున్నాయి. అలా పెంచాలంటే ఇంకా 50 ఫీట్ల వరకైనా కాల్వ వెంట భూమి కావాలి. కాల్వ ఎడమవైపున తూములు ఉండటంతో అటు తీసుకోం. కుడి వైపునే విస్తరించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాల్వ పక్కన భూమిని ఇవ్వాలంటే ఎలా. దీన్ని ఎలా పడితే అలా ఇవ్వలేం.” ఇది నీటి పారుదల శాఖ సమాధానం.
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన తాయిలాలకు ఒక్కొక్కటిగా బ్రేక్పడుతోంది. ఉప ఎన్నికల్లో కుల రాజకీయాలు చేసిన గులాబీ నేతలు.. ఒక్కో కులానికి, సంఘానికి భవనాల కోసం భూములు ఇచ్చారు. మొత్తం ఎస్సారెస్పీ కాల్వ వెంట భూమినే పంచి పెట్టారు. హుజురాబాద్ శివారులోని కరీంనగర్‌రోడ్డులో కాకతీయ కాల్వ వెంట, ఇటు సైదాపూర్రోడ్డులోని బోర్నపల్లి శివారు, కొన్నింటికి కేసీ క్యాంపు సమీపంలోని పాత ఎస్సారెస్పీ ఉద్యోగుల క్వార్టర్ల పరిధిలోని భూమిని ఇచ్చారు. వైశ్య భవనం, రెడ్డి భవనం కోసం కేసీ క్యాంపులో, డబుల్ బెడ్ రూం ఇండ్లు, జర్నలిస్టులకు బీపీఎల్ కింద బోర్నపల్లి రోడ్డులో, కుల, యువజన సంఘాలు, ఇతర కార్మిక సంఘాలకు కరీంనగర్ రోడ్డులో స్థలాలు ఇచ్చినట్లు లెటర్లు ఇచ్చారు. ఉప ఎన్నికల సమయంలో ఇది కొంత వివాదంగా మారినా.. అధికార పార్టీ కావడంతో నెట్టుకువచ్చారు.
ఇప్పుడు ఎలా..?
ఈ స్థలాలన్నింటికీ ముందు నుంచే ఆటంకాలు ఎదురయ్యాయి. బోర్నపల్లి రోడ్డులో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలంపై అక్కడి రైతులు కోర్టుకెక్కారు. ఈ స్థలాన్ని ఎలా ఇస్తారని, ఇప్పటికీ కొంత భాగం తమ పేరుతోనే ఉందంటూ పిటిషన్ దాఖలు చేశారు. తమను కూడా నిర్వాసితులుగా గుర్తించి తమకు కూడా కేటాయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పంపిణీ వాయిదా పడింది.
అటు కాకతీయ కాల్వ వెంట తమకు భూమి కేటాయించారని కొన్ని సంఘాలు చదును చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. కానీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ కేటాయింపులు కుదరవని ఓ ఏఈ అనడంతో.. సదరు ఏఈని ఆదిలాబాద్‌కు బదిలీ చేయించినట్లు మంత్రి హరీశ్‌రావుపై ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈఎన్సీకి ఎన్ఓసీ లేఖలు
ప్రస్తుతం కేటాయించిన భూమి కోసం నీటిపారుదల శాఖ ఈఎన్సీకి దాదాపు 46 లేఖలు వచ్చాయి. సుమారు 22 లేఖలను పరిశీలించారు. కానీ వీటిలో రెండింటికి మాత్రమే ఎన్ఓసీ ఇచ్చారు. బోర్నపల్లి రోడ్డులో డబుల్‌బెడ్ రూం ఇండ్ల కోసం రెండు ఎకరాలు, కేసీ క్యాంపులో వైశ్య భవనం కోసం ఎకరం భూమికి మాత్రమే ఎన్ఈసీ విడుదల చేశారు. మిగిలినవన్నీ పెండింగ్పెట్టారు. ఎందుకంటే వాటికి కేటాయింపులు చేసిన ప్రాంతాల్లో కాకతీయ కాల్వ విస్తరణకు చాలా భూమి అవరసం ఉంటుందని ఇప్పటికే గుర్తించారు. నాలుగేండ్ల కిందటే కాకతీయ కాల్వ సామర్థ్యాన్ని 9 వేల క్యూసెక్కులు పెంచేందుకు డీపీఆర్‌లు సైతం సిద్ధం చేశారు. కానీ ఇంకా పనులు చేయలేదు. భవిష్యత్తులో ఈ పనులు చేయాలంటూ కుడివైపున భూమి చాలా వరకు అవసరం.
విస్తరణ, మట్టి నిల్వ చేయడం, కట్టలకు గ్రిప్ కోసం దాదాపు 50 నుంచి 60 ఫీట్ల వరకు భూమి అవసరం ఉంటోంది. ఇప్పుడు దాదాపు 70 నుంచి 80 ఫీట్ల వరకే ఎస్సారెస్పీ భూమి ఉంది. దీనిలో కేవలం 20 నుంచి 30 ఫీట్లు కాకతీయ కాల్వ కోసం మినహాయించి, మిగిలిన భాగంలో సంఘాల భవనాలకు భూమిని కేటాయించారు. ఆ కాగితాల ప్రకారం సంఘాల భవనాలకు భూమి ఇస్తే.. ఇక కాకతీయ కాల్వకు మిగిలే భూమి ఉండదు. దీంతో కాల్వను మరమ్మతు చేయాలన్నా సాధ్యం కాదు. దీనిపై ఎన్ఓసీ కోసం వచ్చిన లేఖలన్నీ ఈఎన్సీ దగ్గరే ఆగిపోయాయి. కొన్నింటినీ ప్రిన్సిపల్సెక్రెటరీ దగ్గరకు పంపించినా.. అవి అలాగే తిరిగి వచ్చాయి. మరోవైపు తమకు భూమి ఇచ్చారని అక్కడ నిర్మాణ పనులు, చదును కోసం వెళ్లిన వారిని అడ్డుకుంటున్నారు. ఎన్ఓసీ వచ్చేదాకా రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో హుజురాబాద్ఉప ఎన్నికల తాయిలాలకు బ్రేక్‌పడినట్లు అయింది.
ఇవ్వడం కష్టమే
ప్రస్తుతం కేటాయించిన ప్రాంతాల్లో భూములు ఇవ్వాలంటే సాధ్యం కాదని ఇరిగేషన్అధికారులు చెప్పుతున్నారు. ప్రధానంగా కాల్వ విస్తీర్ణం పెంచాలంటూ ఇప్పుడున్న భూమి సరిపోతుందని, కుల సంఘాలకు ఇస్తే కాల్వకు ప్రమాదమేనని చెప్పుతున్నారు. దీనిపై శాఖకు నివేదికను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
హరీశ్చుట్టూ ప్రశ్నలు
మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడే మకాం వేసిన మంత్రి హరీశ్‌రావు ఈ భూములు, నిర్మాణాలకు చెక్కులు పంపిణీ చేశారు. వీటిపై పూర్తి బాధ్యత తనదేనంటూ ప్రకటించారు. భూమి ఎలా ఇస్తామంటూ చెప్పిన ఏఈని బదిలీ చేశారు. కానీ ఇప్పుడు సంబంధిత శాఖ నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం, కేటాయించిన భూమి దగ్గరకు అధికారులు రానీయకపోవడంతో మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఉప ఎన్నికల సమయంలో తనదే బాధ్యత అంటూ చెప్పిన మంత్రి.. ఇప్పుడు కనీసం రిప్లై కూడా ఇవ్వడం లేదని హుజురాబాద్‌కు చెందిన పలువురు ఆరోపిస్తున్నారు.