కేసీఆర్ నయా స్కెచ్.. వాటితో ప్రత్యర్థులకు చెక్ పెట్టినట్టేనా..?

by Sridhar Babu |   ( Updated:2021-08-04 08:58:40.0  )
cm-kcr
X

దిశప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలి ప్రదేశాన్ని బట్టి వైవిధ్యంగా మారుతోంది. హుజురాబాద్ బైపోల్స్‌ను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్ తన పర్యటనలు కొనసాగిస్తున్నారా..? అన్న చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలకు చెక్ పెట్టేలా సీఎం పర్యటనలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు హాలియాలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి ప్రజలకు వరాల జల్లు కురిపించారు. అంతకుముందు జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికల్లోనూ హామీల వర్షం కురిపించారు. ఎన్నికల తరువాత ఆ ప్రాంతాలను పట్టించుకున్న పాపాన పోలేదని హుజురాబాద్‌లో ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించిన సీఎం దానిని తిప్పి కొట్టే ఎత్తుగడతో ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఇందులో భాగంగానే హాలియాలో పర్యటించిన సీఎం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు సంబంధించిన నిధులు విడుదల చేయడం, ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించారని అర్థం అవుతోంది. అలాగే దత్తత గ్రామమైన వాసాలమర్రిలో కూడా ఇదే విధానంతో వ్యవహరించారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా రానున్న కాలంలో ఇదే విధానాన్ని అవలంభిస్తారన్న నమ్మకాన్ని ఇక్కడి ప్రజల్లో కల్పించే ప్రయత్నంలో భాగంగానే టూర్లకు శ్రీకారం చుట్టారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 16న హుజురాబాద్‌లో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు భారీ స్కెచ్ వేసుకున్నారనే అర్థం అవుతోంది. ఇప్పటికే దళిత బంధు, రేషన్ కార్డుల పంపిణీ, రెండో విడుత గొర్రెల పంపిణీ వంటి భారీ కార్యక్రమాలకు హుజురాబాద్‌ను వేదికగా చేసుకున్నారు. అయితే, 16 నాటి పర్యటనతో మరిన్ని ప్రకటనలు చేసి ఇక్కడి ఓటర్లను ఆకర్షించే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed