లాస్ట్​ చాన్స్​..!

by Shyam |
లాస్ట్​ చాన్స్​..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయేతర ఆస్తులకు ఇకపైన మ్యూటేషన్​ తప్పనిసరి, ఆ ప్రక్రియ పూర్తికాకపోతే భవిష్యత్తులో భూముల బదిలీలో చిక్కులు తప్పవు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం (ఆర్వోఆర్ చట్టం)పై ప్రగతి భవన్‌లో బుధవారం సమీక్ష జరిగింది. అనంతరం సీఎం పలు విషయాలపై స్పష్టత ఇచ్చారు. వ్యవసాయ భూముల సమీపంలో కట్టుకున్న ఇళ్లు వ్యవసాయేతర కేటగిరీలోకి వస్తాయని, వెంటనే వ్యవసాయ కేటగిరీ నుంచి మార్చుకోవాలని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ‘నాలా’ కన్వర్షన్‌ను ఉచితంగా చేస్తుందన్నారు. భవిష్యత్తులో ఆస్తుల నమోదు ప్రక్రియ, రెగ్యులరైజేషన్‌, ఉచిత ‘నాలా’ కన్వర్షన్‌ వంటివి ఏవీ ఉండవని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్‌టీఎల్, నాలా, యూఎల్​సీ పరిధిలో నిర్మించుకున్న ఇండ్లకు ఈ మ్యూటేషన్​ వర్తించదని తెలిపారు.

ఇకముందు అంగుళం భూమి బదిలీ కావాలంటే ‘ధరణి’ పోర్టల్ తోనే జరుగుతుందన్నారు. వ్యవసాయేతర ఆస్తులను ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో సాదా బైనామాలను ఉచితంగా మ్యూటేషన్ చేయించేందుకు త్వరలోనే చివరిసారిగా అవకాశం కల్పించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. పూర్తి వివరాలు ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సాదా బైనామాలకు అనుమతించే ప్రసక్తే లేదని, ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివాదాలుంటే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

ఏళ్ల తరబడి నిరుపేదలు ఉంటున్న ఇండ్ల స్థలాలను పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆస్తులకు మ్యూటేషన్​కు, ఎల్ఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. వ్యవసాయ భూముల పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తులను ఉచితంగా ‘నాలా’ కన్వర్షన్ చేయనున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లకు రెగ్యులరైజేషన్ వర్తిస్తుందని తెలిపారు.

వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదారు పాస్‌బుక్‌లను జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. భూ వివాదాలు , ఘర్షణల నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించడం, వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పనకు ప్రత్యేక రంగులో పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు చెప్పారు. పాస్ పుస్తకాలు జారీ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని ఇళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావాల్సిందేనని, ప్రతీ ఇంటికి నెంబర్ కేటాయింపు, ట్యాక్స్ వసూలు, నాన్ అగ్రికల్చర్ కింద ‘నాలా’ కన్వర్షన్ చేస్తామన్నారు. ధరణి పోర్టల్ వినియోగంలోకి రావడం ఆలస్యమైనా సరే, వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ పోర్టల్ ప్రారంభమైన తర్వాతే జరుగుతుందని తెలియజేశారు.

ప్రతి ప్రభుత్వ ఉత్తర్వు, సర్క్యూలర్ ఇక నుంచి తెలుగు, ఇంగ్లిష్​ భాషల్లో విడుదలవుతాయని సీఎం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సమాచారం సౌలభ్యంగా ఉండేలా అధికారులు వ్యవహరించాలని సూచించారు.

రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్‌లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్ధీకరణ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో ముఖ్యమంత్రి ప్రగతిభవన్ గురువారం సమావేశం కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed