రైతుబంధుకు సర్కార్ కొర్రీలు

by Shyam |   ( Updated:2020-05-12 22:19:53.0  )
రైతుబంధుకు సర్కార్ కొర్రీలు
X

దిశ, న్యూస్ బ్యూరో: రైతులకిది చేదువార్తే. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మింగుడుపడని హుకూం జారీ చేసింది. అవేంటో ముఖ్యమంత్రి మాటల్లో మీరే చూడండి. ”ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతుబంధు ఇవ్వాలి. ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి” అనే నిర్ణయం జరిగిందని, రానున్న వర్షాకాలం పంటల నుంచే ఇది అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఏది పడితే అది పండించి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పంటలు వేసి, పండిన పంటలను మార్కెట్‌‌కు తీసుకొచ్చి కొనమంటే ఎవ్వరూ కొనరని స్పష్టం చేశారు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దని, డిమాండ్ ఉన్న పంటలే సాగుచేయాలన్నారు. అమ్ముడుపోయే సరుకే పండించాలని, దానికి అనుగుణంగా రైతుల ఆలోచనల్లో మార్పు రావాలని పేర్కొన్నారు. రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ వివరాలను ఈ నెల 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి వివరించనున్నారు. పంట మార్పిడి, క్రాప్ కాలనీ ఏర్పాటు మినహా మరో గత్యంతరం లేదని అందరూ ఒకే పంట వేసే విధానం పోయితీరాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రగతి భవన్‌లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ పైస్పష్టతను ఇచ్చారు.

వ్యవసాయ నిపుణులు, ఆ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ, శాస్త్రవేత్తలు తదితరులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా వారి నుంచి పై అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటిపై గంటల వ్యవధిలోనే మరోమారు సమీక్ష చేసిన ముఖ్యమంత్రి వాటికి ఆమోదముద్ర వేసే తీరులో విధాన నిర్ణయం తీసుకున్నారు. రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే చెప్తుందని, ఆ పంటలకు మద్దతు ధర ఇస్తామని కూడా చెప్తున్నదని, ప్రభుత్వం ఇంత చొరవ చూపుతూ ఉంటే రైతులకు ఇంకోరకమైన ఆలోచన ఎందుకుండాలని సీఎం ప్రశ్నించారు. ఈ వర్షాకాలం నుంచే వరి పంటతో ఈ నూతన నియంత్రిత పద్ధతి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈసారి 50 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేయాలని, ఇందులో 10 లక్షల ఎకరాల్లో ‘తెలంగాణ సోనా’ రకం ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఏ రైతు ఏ రకం పండించాలి, ఎంత విస్తీర్ణంలో పండించాలి.. అనే విషయాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మరో 50 లక్షల ఎకరాల్లో పత్తి, ఇంకో పది లక్షల ఎకరాల్లో కందులు పండించాలని నిర్దేశించారు. ఈ వివరాలను కూడా త్వరలోనే వ్యవసాయ అధికారులు వెల్లడిస్తారని తెలిపారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగు ఉంటుందని తెలిపారు. ఇక్కడ కూడా ఎంత మేరకు వీటిని పండించాలి, ఎలాంటి కూరగాయలను సాగు చేయాలి, ఎంత విస్తీర్ణంలో పండించాలో ప్రభుత్వం త్వరలో సూచిస్తుందని పేర్కొన్నారు.

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం… అందరూ ఒకే రకమైన పంటలు పండించడమేనని ఇరవై ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నానని పేర్కొన్న కేసీఆర్, మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్లుగా పంటలు పండించాలని తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచే చెప్తున్నానని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్రమోడీ, వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ కు పంటల మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటు గురించి చాలాసార్లు చెప్పానని అన్నారు. తెలంగాణలో వ్యవసాయ పరిస్థితిలో మార్పు తేవడం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నదని, అందులో భాగమే దేశంలో ఏ రాష్ట్రంలో లేకున్నా ఇక్కడ మాత్రం రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, కరోనా కష్టకాలంలో కూడా రైతుల పంటలను పూర్తిగా ప్రభుత్వమే కొనడం, గిట్టుబాటు ధర చెల్లించడం చేస్తున్నదని, ఇప్పుడు నియంత్రిత సాగు పద్ధతికి శ్రీకారం చుడుతున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నదని, ప్రపంచమే తెలంగాణను చూసి నేర్చుకోవాలని అభిలషిస్తున్నదని పేర్కొన్నారు.

కేసీఆర్ బతికున్నంతవరకు రైతుబంధు

కేసీఆర్ బతికున్నంతవరకు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు రైతుబంధు పథకం ఆగదని, యథావిధిగా అమలవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎన్నో ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్‌ను రైతుబంధు ఆదుకున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలు, గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన హుజూర్‌నగర్ లాంటి ఉప ఎన్నికలు, ఇటీవల జరిగిన పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇలా చాలా సందర్భాల్లో రైతుబంధు ఓటు బ్యాంకుగా ఉపయోగపడింది. అధికారంలోకి తీసుకొచ్చింది. కానీ, గతేడాది ఆర్థిక మాంద్యం కారణంగా ఖరీఫ్, రబీ సీజన్‌ల రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ఇంకా చాలామంది రైతులకు రైతుబంధు అందాల్సి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ రానే వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు ఆగదని, కొనసాగిస్తామని చెప్పిన కేసీఆర్ కేవలం వారం రోజుల వ్యవధిలోనే ‘షరతులు వర్తిస్తాయి’ తరహాలో ‘నియంత్రిత సాగు విధానా’నికి లోబడి అనే షరతు పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed