బిగ్ బ్రేకింగ్.. సొంత మండలంలో కేసీఆర్‌కు భారీ షాక్..

by Anukaran |   ( Updated:2021-09-23 00:23:28.0  )
బిగ్ బ్రేకింగ్.. సొంత మండలంలో కేసీఆర్‌కు భారీ షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగిలింది. కేసీఆర్ సొంత మండలానికి చెందిన గ్రామాల సర్పంచ్‌లు సీఎంకు ఝలక్ ఇచ్చారు. మండలంలోని 16 మంది సర్పంచ్‌లు రాజీనామాలు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

వివరాల ప్రకారం.. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సొంత మండలమైన సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలంలోని 16 మంది సర్పంచ్‌లు బుధవారం ఓ వ్యవసాయ క్షేత్రంలో రహస్యంగా సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించకుంటే రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడంలేదు. దీనికితోడు ప్రభుత్వ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో సర్పంచ్‌లు వడ్డీకి డబ్బు తెచ్చి కార్మికులకు వేతనాలు ఇచ్చి పనులు పూర్తి చేస్తున్నారు. అధికారులు మాత్రం బిల్లుల డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో తాము వడ్డీ డబ్బులు కట్టలేక అప్పుల పాలవుతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా పనులన్నీ తాము చేస్తుంటే ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇవ్వడం తలనొప్పిగా మారిందని వాపోతున్నారు. గ్రామ సర్పంచులంటే చెత్త తొలగించడం, మొక్కల సంరక్షణ, వీధి దీపాల నిర్వహణ అన్నట్లుగా మారిపోయిందని బాధపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమ బిల్లులు క్లియర్ చేయకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Next Story