అల్లర్లు, దూషణలకు అసెంబ్లీ వేదిక కాదు

by Anukaran |   ( Updated:2020-09-03 09:05:16.0  )
అల్లర్లు, దూషణలకు అసెంబ్లీ వేదిక కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లర్లు, దూషణలకు అసెంబ్లీ వేదిక కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. పనికిమాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కాదని, సమావేశాల నిర్వహణలో గుణాత్మక మార్పులు రావాలని సీఎం తెలిపారు. ఆచరణాత్మక సూచనలను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ్యులు వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా మాట్లాడాలన్నారు. ఈనెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, విప్‌లతో గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాస్తవాలను ప్రజల ముందు వివరించేందుకు మంత్రులు సిద్ధం కావాలని స్పష్టం చేశారు.

కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాలతో పంట నష్టం, తీసుకోవాల్సిన చర్యలు, శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు, నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలు, జీఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం, కేంద్రం అవలంభిస్తోన్న ఆర్థిక విధానాలతో కలుగుతున్న నష్టం, రిజర్వేషన్లకు ప్రభుత్వం చేసిన తీర్మానాల్లో కేంద్రం నాన్చివేత ధోరణి, నియంత్రిత పద్ధతిలో వ్యవసాయ రంగం , పీవీ శతజయంతి ఉత్సవాలు తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పరంగా చర్చకు సిద్ధమైన అంశాలను బీఏసీలో ప్రతిపాదించాలని పేర్కొన్నారు.

ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అసెంబ్లీలో మొదటి రోజే ఘన నివాళి అర్పిద్దామని అన్నారు. చర్చకు వచ్చే అన్నిఅంశాలపై సంపూర్ణమైన సమాచారంతో మంత్రులు రెడీగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా అసెంబ్లీ సమావేశాలు జరగాలని, ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చ జరగడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చట్ట సభలకు మించిన వేదిక లేదని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా అసెంబ్లీని నిర్వహించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాల అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో సభ్యులు విశ్లేషించాలని, ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సభ్యులు ప్రస్తావించాలని సమావేశంలో సీఎం వివరించారు.

Advertisement

Next Story

Most Viewed