16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేటీ

by Shyam |
16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేటీ
X

దిశ, న్యూస్ బ్యూరో: సీఎం కేసీఆర్‌ ఈ నెల 16న అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. వ్యవసాయం, ఉపాధి హామీ పనులు సహా ఇతర అంశాలపై వారితో చర్చించనున్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి స్థానిక సంస్థల బాధ్యతలు చూస్తున్న అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, అటవీ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకావాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఒక మెమొలో ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులతో వీలైనన్ని శాఖల్లో ఎక్కువ పనులు చేయాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. నియంత్రిత సాగు, రైతు వేదికల నిర్మాణం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలు, సీజనల్‌ వ్యాధుల నివారణ తదితర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం.

అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల బాధ్యతలు చూస్తున్న అదనపు కలెక్టర్లు జిల్లాలను విడిచి ప్రగతి భవన్ సమావేశానికి వస్తున్నందున్నా ఆయా జిల్లాల్లో రోజువారీ పనులకు అంతరాయం కలగకుండా మరో అదనపు కలెక్టర్ పర్యవేక్షించాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నందున తక్షణం చేపట్టాల్సిన పనులను, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించడం, కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వస్తున్న నిధులు, ఉపాధి హామీ పథకానికి మంజూరవుతున్న నిధులు, వాటి వినియోగం తదితరాలపై కూడా ఈ సమావేశంలో లోతుగా చర్చ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed