మండలిలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఫలించేనా..?

by Anukaran |
cm kcr, vanidevi
X

దిశ, తెలంగాణ బ్యూరో: మండలి ఎన్నికల్లో అధికార పార్టీ వ్యూహం ప్రతిపక్షాలను డైలామాలో పడేస్తోంది. గెలుపోటముల పరిస్థితి ఎలా ఉన్నా… ఇప్పుడు పీవీ కూతురుకు టికెట్​ ఖరారు చేసి విమర్శలకు బ్రేక్​ వేసినట్టైంది. ఇప్పటికే పీవీ శతజయంతి ఉత్సవాలతో అటు కాంగ్రెస్​ పార్టీ నుంచి పీవీ అంశాన్ని హైజాక్​ చేసిన సీఎం కేసీఆర్​ తాజాగా వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. పీవీ కూతురు వాణీదేవీకి ఎమ్మెల్సీ ఇస్తారని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్​ కోటా వస్తుందని ఊహించారు. కానీ ఎమ్మెల్సీ టికెట్​ ఇచ్చారు. నిన్నటిదాకా మండలి పోరులో హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ స్థానంపై మౌనంగా ఉన్న గులాబీ అధిష్టానం వాణీదేవిని రంగంలోకి దింపింది.

ప్రతిపక్ష వర్గాలకు క్లిష్టమే

పీవీ కూతురుకు టికెట్​ ప్రకటించడంతో ప్రతిపక్ష కాంగ్రెస్​తో పాటు బీజేపీకి కూడా క్లిష్ట పరిస్థితులే ఎదురుకానున్నాయి. ఎందుకంటే అభ్యర్థిపై విమర్శలు లేనట్టే. ఇప్పటికే వరంగల్​ స్థానం నుంచి పోటీలో ఉన్న పల్లా రాజేశ్వర్​రెడ్డిపై విమర్శలు పదునెక్కాయి. కానీ వాణీదేవిపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేని పరిస్థితి. కాంగ్రెస్​కు ఆధ్యుడు పీవీ కూతురు కావడం, కాంగ్రెస్​ కూడా పీవీ జయంతి ఉత్సవాలు చేస్తున్న విషయం తెలిసిందే. అటు బీజేపీ కూడా అంతే పరిస్థితి. తెలంగాణకు చెందిన పీవీని విమర్శించలేని పరిస్థితి. మరోవైపు ఈ స్థానం నుంచి టీఆర్​ఎస్​కు ముందు నుంచీ వ్యతిరేకతే ఎదురవుతోంది. వరుసగా పార్టీకి అభ్యర్థులకు చేదు అనుభవమే. గతంలో దేవీ ప్రసాద్​ ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు అదే సామాజిక వర్గానికి టికెట్​ను ఖరారు చేశారు. దీంతో ఈ సామాజిక వర్గం ఓట్లు కూడా కలిసి వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం.

వ్యూహమేమిటీ..?

ఒకదశలో ఈ స్థానం నుంచి పోటీకే వద్దనుకున్నట్లు అధికార పార్టీ భావించింది. కానీ వ్యూహాత్మకంగా వాణీదేవిని బరిలోకి దింపింది. దీంతో కొంత మేరకు ఓట్లు లాభిస్తాయనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. పీవీ పేరుతో కాంగ్రెస్​కు చెందిన కొన్ని ఓట్లు కూడా తమ ఖాతాలో పడుతాయనుకుంటున్నారు. ఇప్పుడు ప్రచారంలో కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. పీవీకి టీఆర్​ఎస్​ పార్టీ నుంచి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రచారంలో వాడుకోనున్నారు. పీవీ కూతురు వాణీదేవికి టికెట్​ ఇవ్వడంపై వచ్చే ఎన్నికల్లో కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుందని టీఆర్​ఎస్​ అధినేత భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ వాణీదేవి గెలిస్తే టీఆర్​ఎస్​ బోనస్​గా తీసుకుంటోంది. ఎందుకంటే ఈ స్థానంపై ఎలాగూ ఆశలు పెట్టుకోవడం లేదు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక ఓడిపోతే మాత్రం దాన్ని అన్ని వర్గాలపై విమర్శలకు పదునుపెట్టనున్నారు. పీవీకి గౌరవంతో ఆయన కూతురుకు టికెట్​ ఇస్తే కాంగ్రెస్​, బీజేపీ సహాకరించలేదంటూ ఆరోపణలు చేసేందుకు టీఆర్​ఎస్​కు అస్కారం ఉంటోంది. అంతేకాకుండా అనుకున్నట్టుగానే పీవీ కుటుంబానికి సగౌరవం ఇచ్చామని, పట్టభద్రులు ఎందుకో ఆదరించలేదనే ప్రచారాన్ని కూడా తీసుకువచ్చేందుకు టీఆర్ఎస్​ ప్లాన్​ వేస్తోంది.

ఇప్పుడు కేటీఆర్​ ప్రచారంలో పాల్గొంటారా..?

మరోవైపు అధికార పార్టీలో మరో ప్రచారం మంత్రి కేటీఆర్​ వ్యవహారం. కొన్ని రోజులకు పార్టీ వ్యవహారాలకు కేటీఆర్​ దూరంగా ఉంటున్నారని, మౌనంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వరంగల్​ పట్టభద్రుల స్థానంలో ఆయన వర్గం ప్రచారంలో పాల్గొనడం లేదు. రాజకీయ కారణాలేమైనా ఆ వర్గం మొత్తం అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. మండలి పోరులో భాగంగా హైదరాబాద్​ స్థానాన్ని మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​తో పాటు పలువురు ఆశించారు. కానీ మంత్రి కేటీఆర్​ వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ప్రస్తుతం పార్టీ నుంచి రాజకీయ వ్యవహారాల్లో మౌనంగా ఉన్న మంత్రి కేటీఆర్​తో పాటు ఆయన వర్గం ఇప్పుడు ప్రచారంలో పాల్గొంటుందా… లేదా అనేది సందేహంగానే మారింది. ఒకప్పుడు మంత్రులపై మండలి పోరును టార్గెట్​ పెట్టినా… ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు. మంత్రులు కూడా దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇప్పుడు పీవీ కూతురు వాణీదేవి అభ్యర్థి కావడంతో ఎలా వ్యవహరిస్తారనేది తేలాల్సిన అంశమే.

Advertisement

Next Story