జానారెడ్డి TRS కండువా కప్పుకుంటా అన్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-08-02 03:27:12.0  )
kcr-jana-reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. నాగార్జున సాగర్‌లో పర్యటించారు. ఈ క్రమంలో జిల్లాలోని హాలియాలో సభలో ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు కుళ్లుకుంటున్నారని అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చింది మేమే అని తెలిపారు. మేము చెప్పిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు.

దళిత బంధుపై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. అందులో నిజం లేదని అన్నారు. రాష్ట్రంలో 70-80 శాతం మంది అర్హులైన దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందిచనున్నట్టు.. ప్రతీ నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళిత బంధు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. సాగర్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గంలో బంజారా భవన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పోడు భూముల సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని అన్నారు. హాలియాలో మిని స్టేడియం ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ నేత జానారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రోజు శాసన సభలో చర్చ జరుగుతుండగా జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రెండేళ్లలో అందరికి కరెంట్ అందించే విధంగా పనులు చేస్తామని.. అన్ని వర్గాలకు ముఖ్యంగా రైతులకు క్లీన్ పవర్ 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పాము. ఆ విషయాన్ని జానారెడ్డి ఎగతాళి చేస్తూ మీరు రెండేళ్లకు కాదు కదా.. పదేళ్లకు కూడా ఆ పని చేయలేరని ఎగతాళి చేశారు. ఒకవేళ రెండేళ్లకు కరెంట్ ఇస్తే.. నేనే గులాబీ కండువా కప్పుకుని టీఆర్ఎస్‌ పార్టీకి ప్రచారం చేస్తానని జానారెడ్డి అసెంబ్లీలో మాట్లాడినట్టు తెలిపారు. అయితే రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందేనని అన్నారు. అది మరిచిపోయి.. మాట తప్పి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాతో మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజలకు ఆయనకు తగిన బుద్ది చెప్పారని అన్నారు.

Advertisement

Next Story