సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో నిలిచిపోయే మరో సంచలన నిర్ణయం..

by Anukaran |   ( Updated:2021-08-15 21:54:22.0  )
cm-kcr government
X

దిశ, తెలంగాణ బ్యూరో : పట్టణాల్లో అద్భుతంగా ఆదరణ పొందుతున్న బస్తీ దవాఖానాలు ఇక నుంచి పల్లెలోనూ అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల తరహాలో ప్రతి గ్రామంలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్ట వ్యాప్తంగా 4,380 ఆరోగ్య ఉపకేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వయంగా సీఎం కేసీఆర్ ఈ ప్రస్తావనను తీసుకువచ్చారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ దవాఖనాల్లో ఎంబీబీఎస్ డాక్టర్, స్టాఫ్ నర్స్‌‌, ఏఎన్‌ఎం, ఇతర సపోర్టింగ్ సిబ్బంది ఉంటారు. అయితే ఇప్పటికే గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(పీహెచ్ సీలు) అనుసంధానంగా ఈ సబ్ సెంటర్లు పనిచేయనున్నాయి.

సబ్ సెంటర్లలో లభించే సేవలు ఇవే..

కొత్తగా ఏర్పాటు చేయబోతున్న సబ్ సెంటర్లలో అవుట్ పేషెంట్ సేవలతో పాటు, మాతాశిశు సంరక్షణ, ఇమ్యూనైజేషన్, బీపీ, షుగర్, ఇతర జ్వర పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ సెంటర్లలో ప్రాథమిక పరీక్షల తర్వాత అవసరమైన వారికి ఇక్కడ్నుంచే పెద్ద దవాఖాన్లకు రిఫర్ చేయనున్నారు. ఈ మేరకు ప్రత్యేక వ్యవస్థను రూపకల్పన చేయనున్నారు.

ఎందుకీ నిర్ణయం..

గ్రామాల్లో నివసించే పేద ప్రజల ముంగిటికి వైద్యాన్ని తీసుకురావాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే దుస్థితి పోనుంది. దీంతో ప్రజలకు మరింత చేరువలో వైద్యసేవలు అందడంతో వారిపై ఆర్థిక భారం కూడా తగ్గనుంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం సంపాదించినదాంట్లో 50శాతం ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలోనే ఖర్చుపెట్టాల్సి వస్తున్నది. 20శాతం ఖర్చు మందులు, 30శాతం ఖర్చు వైద్యపరీక్షలు, కన్సల్టేషన్‌ ఫీజులు, దవాఖాన ఫీజులకు సరి పోతుంది. దీంతో నిరుపేదలు ఆర్థికంగా దెబ్బతిని అప్పులపాలవుతూ సరైన పోషకాహారం సైతం తినలేని పరిస్థితిలోకి వెళ్లి అనారోగ్యానికి గురవుతున్నారు. దీన్ని గమనించిన రాష్ట్ర సర్కారు వైద్య సేవలను ప్రజల ముంగిట్లోకి తీసుకు వస్తుంది.

ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సబ్ సెంటర్లు అందుబాటులో ఉన్నా, అక్కడ కేవలం నర్సులు మాత్రమే ఉన్నారు. దీంతో అత్యవసర సమయాల్లో పేషెంట్లకు తీవ్ర సమస్యలు వస్తున్నది. దీంతో డాక్టర్లను కూడా ఆరోగ్య ఉపకేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇది దేశ చరిత్రలోనే మొట్ట మొదటి సారి అని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈమేరకు డాక్టర్లను కూడా పెద్ద ఎత్తున నియామకం చేసుకునేందుకు హెల్త్ డిపార్ట్ మెంట్ ప్లాన్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

హుజారాబాద్: ఉప సర్పంచ్ వేధింపులు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా

బీజేపీపై నోరు జారిన బండి సంజయ్.. షాకైన లీడర్లు

Advertisement

Next Story

Most Viewed