నా చావుకు సీఎం జగనే కారణం.. సంచలనంగా మారిన సూసైడ్ నోట్

by Anukaran |   ( Updated:2021-08-14 06:17:53.0  )
jagan
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా రాయదుర్గంలో వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. నా చావుకు కారణం ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగం అని సూసైడ్ లేఖ రాసి మరీ మహేష్‌ అనే వార్డు వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే రాయదుర్గంలోని నాలుగవ సచివాలయం 9వ వార్డు వాలంటీర్ గా మహేష్‌ పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడటం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే మహేష్‌ రాసిపెట్టిన సూసైడ్‌ నోట్‌లో ”నా చావుకు కారణం సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగం” అని పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్నారని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. తనలాంటి పరిస్థితి మరొక వాలంటీర్ కు రాకుండా చూడాలని సూసైడ్ నోట్‌లో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇప్పటికీ తమతో బండ చాకిరీ చేయిస్తున్నారనీ, అన్ని రకాలుగా వాడుకుంటున్నారనీ గ్రామ, వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్నవారు ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు అధికారులు, మరోవైపు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా మానసిక ఇబ్బందులకు గురవుతున్నామని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. అధికారుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ల కంటే.. అధికార పార్టీ నాయకుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు చాలా కష్టంగా మారాయని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed