ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలి

by Shyam |
ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలి
X

-లేకుంటే రైతుబంధు ఆపేయాలి
– గిట్టుబాటు ధర చెల్లించొద్దు
– ప్రతీ ఏటా ప్రభుత్వమే కొనుగోళ్ళు చేయడం సాధ్యం కాదు
– ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు
– ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలో నిర్ధారణ

– రానున్నవర్షకాలం సీజన్‌లో 10 లక్షల ఎకరాల్లో ‘సన్నాల’ సాగు
– ప్రభుత్వం సూచించిన విత్తనాలనే మార్కెట్‌లో అమ్మాలి
– ప్రభుత్వానికి నిపుణుల, శాస్త్రవేత్తల సూచన

దిశ, న్యూస్ బ్యూరో :

“ప్రభుత్వం సూచించిన పంటలు వేయని రైతులకు ‘రైతుబంధు’ సాయాన్ని ఆపేయాలి, వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దు. పంటల సాగు ఎవరికిష్టం వచ్చినట్లు వారు చేసుకునే విధానం వద్దు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పినట్లు పంటలు వేసే విధానం రావాలి. కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పంటల కొనుగోళ్లు జరుపుతోంది. ప్రతీ ఏటా ఇలాగే కొనుగోళ్లు జరపడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు…” ఇలాంటి కొన్ని అభిప్రాయాలను వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన వ్యవసాయ సంబంధ సమీక్షా సమావేశానికి హాజరైన నిపుణులు పై అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు సీఎం కార్యాలయ సీపీఆర్‌ఓ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పంటల సాగును రైతులు వారి ఇష్ట ప్రకారం సాగు చేసుకునే విధానం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అధికారులు, నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినట్లు పంటలు వేసే విధానం రావాలని ఈ సమావేశంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రభుత్వం సూచించిన పంటలే సాగుచేసే నియంత్రిత పద్ధతి వచ్చి తీరాలని వారు సూచించారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నా, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంపూర్ణ ఫలితాలు ఇవ్వాలన్నా పంటలకు మంచి ధరలు రావాలని పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి రైతులు పంటలు వేయాలని, అలాంటి చైతన్యం రైతులకు రావాలని, క్రమపద్ధతి అలవాటు కావడం కోసం ప్రభుత్వం కొంత కఠినంగానే వ్యవహరించాలన్నారు. వ్యవసాయ అధికారులు, యూనివర్శిటీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు సరైన అధ్యయనం, పరిశోధన ద్వారా ఎక్కడ ఏ పంట ఎంత మేర వేయాలో నిర్ణయిస్తారని, అలాంటి మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించడం తప్ప మరో మార్గం లేదన్నారు.

సన్న బియ్యంపై ఫోకస్..

రాష్ట్రంలో ప్రజల ఆహారపు అలవాట్లు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలో నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 90 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయవచ్చని, ‘సన్న’ రకాలు ఎన్ని పండించాలి, దొడ్డు రకాలు ఎన్ని పండించాలనే విషయంలో స్పష్టత ఉండాలన్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు బాయిల్డ్ రైస్ ఎగుమతి లక్ష్యంతో దొడ్డు రకాలు పండించాలన్నారు. ‘తెలంగాణ సోనా బియ్యం’ రకానికి మంచి డిమాండ్ ఉందని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా మంచివని, అందుకే దీన్ని ‘షుగల్ ఫ్రీ రైస్’గా నిపుణులు గుర్తించారని వీరు ఉదహరించారు. ఈ రకం బియ్యంలో ‘గ్లైసమిన్ ఇండెక్స్’ తక్కువగా ఉంటుందని అమెరికా జర్నల్స్ కూడా ప్రచురించాయని గుర్తుచేశారు. ఈ వర్షాకాలం సీజన్‌లోనే పది లక్షల ఎకరాల్లో ఈ రకాన్ని పండించాలని సూచించారు.

ప్రభుత్వం సూచించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే మార్కెట్‌లో లభ్యమయ్యేలా చూడాలని, విత్తన వ్యాపారులు తమకు తోచిన విత్తనాలను రైతులకు అంటగట్టే పద్ధతి పోవాలని, పూర్తి స్థాయి నియంత్రణ రావాలని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి మార్గదర్శకం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలని ప్రభుత్వానికి వీరు సూచించారు. ఇలా సూచించిన నిపుణుల్లో వ్యవసాయ వర్శిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, విత్తన కార్పొరేషన్ ఎండీ కేశవులు, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ సీమా, అగ్రి బిజినెస్ నిపుణులు రాధిక, కొంత మంది వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నట్లు ఆ ప్రకటనలో సీపీఆర్‌ఓ పేర్కొన్నారు.

Advertisement

Next Story