దసరా వరకు పనులన్నీ పూర్తి కావాలే : కేసీఆర్

by Shyam |   ( Updated:2020-09-13 07:35:25.0  )
దసరా వరకు పనులన్నీ పూర్తి కావాలే : కేసీఆర్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి ఆలయ పున:నిర్మాణ పనులన్నీ దసరా వరకు పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆలయ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం యాదాద్రి అంతా కలియ తిరిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పనులకు సంబంధించిన వివరాలను ఆలయ ఈఓ గీత, ఆర్కిటెక్చర్ ఆనంద సాయి వివరించారు.

అయితే అంతకుముందు బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత తూర్పు ప్రాకారాలను, ఆలయ మాడ వీధులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. యాదాద్రిపై ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి పూజలు చేశారు. ప్రధాన ఆలయం గోడలపై వేసిన నర్సింహాస్వామి దశావతరాలకు సంబంధించిన చిత్రాలను కేసీఆర్ తిలకించారు. అనంతరం ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి ఆలయానికి సంబంధించిన టోటల్ వ్యూను ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి వీడియో రూపంలో కేసీఆర్‌కు ప్రజంటేషన్ తరహాలో ఇచ్చారు.

ఘాట్ రోడ్డులో కన్పించిన వానరాలకు సీఎం కేసీఆర్ స్వయంగా అరటి పళ్లను అందించారు. ఇదిలావుంటే.. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి గుట్టపైకి మీడియాను అనుమతించలేదు. దీంతో సీఎం యాదాద్రి పర్యటనకు మీడియాను అనుమతించకుండా ఉండాల్సిన అవసరం ఏంటన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సీఎం వెంట మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ సంతోష్ కుమార్, ఇతర నేతలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed