‘సమస్యలు విన్నవించేందుకు సీఎం అపాయింట్ మెంట్ కావాలి’

by Shyam |
‘సమస్యలు విన్నవించేందుకు సీఎం అపాయింట్ మెంట్ కావాలి’
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా గుర్తింపు పొందిన వైద్యులు, సిబ్బంది సమస్యలు విన్నవించుకునేందుకు సీఎం కేసీఆర్ సమయం ఇవ్వాలని తెలంగాణ మెడికల్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కోఠి లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ డాక్టర్ బొంగు రమేష్, కన్వీనర్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుట్లా శ్రీనివాస్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తాము విన్నవించిన సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కోవిడ్ బారిన పడి చనిపోయిన వైద్యులకు కోటి రూపాయలు పరిహారంగా ఇవ్వాలని తాము కోరగా ఆయన రూ 25 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారని అన్నారు. కరోనా బారిన వైద్యులు,సిబ్బందితో పాటు వారి కుటుంబాలకు నిమ్స్ లో వైద్య చికిత్సలు అందించాలని కోరారు.కరోనా రోగులకు వైద్యం అందించే వైద్య సిబ్బంది అదే వైరస్ బారిన పడితే కనీసం హాస్పిటల్స్ లో మంచాలు, వైద్యం అందకపోవడం దారుణమన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్యలకు, సిబ్బందికి కరోనా వైద్యం కోసం నిమ్స్ లో ఓ బ్లాక్ కేటాయించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో మంచాలతో పాటు ఆక్సీజన్ ప్లాంట్ల సామర్ధ్యం పెంచాలని, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగా 50 వేల ఉద్యోగాలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో కాకుండా రెగ్యులర్ పోస్టులలో భర్తీ చేయాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సీఎం అసెంబ్లీలో ప్రకటించిన మాదిరిగా 10 శాతం ఇన్సెంటివ్ రెండు నెలలు ఇచ్చి మానివేశారని, దీనిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు . ఇవే కాకుండా ఎన్నో సమస్యలు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నాయని, వీటన్నింటిని పరిష్కరించేందుకు సీఎం తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరహరి, డాక్టర్ యాకేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, జూపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

Next Story