ఆ స్వభావం కోల్పోతే కరోనా వచ్చినట్లేనా?

by sudharani |
ఆ స్వభావం కోల్పోతే కరోనా వచ్చినట్లేనా?
X

దిశ, న్యూస్ బ్యూరో: ఇప్పటివరకూ దగ్గు, జ్వరం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలను మాత్రమే కరోనా వ్యాధికి సంకేతాలుగా పరిగణించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. కానీ, తాజాగా శనివారం ఐసీఎంఆర్ మాత్రం వాసన, రుచి స్వభావాన్ని కోల్పోయినా కరోనా లక్షణాలుగా అనుమానించాలని పేర్కొంది. ఇందుకోసం కొవిడ్-19 మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. చాలా మంది వైద్య నిపుణులు నోటికి రుచి లేకుండా ఉండడం, వాసనను గుర్తించే స్వభావాన్ని కోల్పోవడం లాంటి లక్షణాలు కూడా కరోనా వ్యాధికి తొలి సంకేతాలుగా భావించవచ్చని పేర్కొన్నారు. కానీ, కేంద్ర వైద్యారోగ్య శాఖ పరిధిలోని ఐసీఎంఆర్ మాత్రం అధికారికంగా వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు వీటిని కూడా కరోనా వ్యాధి లక్షణాలుగా పేర్కొంటూ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో మార్పులు చేసింది.

వీటికి తోడు ఇప్పటివరకూ కరోనా వ్యాధి చికిత్స కోసం వాడుతున్న ఔషధాల్లోనూ మార్పులు చేసింది. కరోనా వ్యాధి చికిత్సకు అజిత్రోమైసిన్‌ను వాడవద్దంటూ స్పష్టం చేసి గత ప్రోటోకాల్‌లో మార్పులు చేసింది. రెమ్‌డెసివిర్ మాత్రలను కూడా లక్షణాలు లేని పేషెంట్లకు, స్వల్ప స్థాయిలో లక్షణాలు ఉన్నవారికి వాడవద్దని, ఒక మోస్తరు లక్షణాలు ఉంటే లేదా తీవ్రంగా ఉన్నట్లయితేనే వాడాలంటూ స్పష్టత ఇచ్చింది. అయితే పన్నెండేళ్ళ వయసులోపు పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు వాడవద్దని స్పష్టం చేసింది. కాలేయ, మూత్ర సంబంధ సమస్యలతో ఇబ్బందిపడేవారికి సైతం ఈ మాత్రలను వాడరాదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed