బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ!

by Harish |
బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: మనకు బ్యాంక్ అకౌంట్ ఉండటం ఇప్పుడెంత అవసరమో..అకౌంట్ ఉన్న బ్యాంక్ వివరాలు తెలుసుకోవడం కూడా అంతే అవసరమని ఓ బ్యాంక్ నిరూపించింది. ఎందుకంటారా? పరిస్థితులు బాగోలేకపోతే, అవకతవకలు జరిగితే బ్యాంకులు కూడా కనుమరుగవుతాయి కాబట్టి. ఎలాగంటారా? తాజాగా ముంబైలోని సీకేపీ కో-ఆపరేటివ్ బ్యాంకు పరిస్థితి బాగోలేదని, కొనసాగడం కష్టమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకు కార్యకలాపాలను రద్దు చేసింది. వివరంగా తెలుసుకుందాం!

ముంబైలోని సీకేపీ కో-ఆపరేటివ్ బ్యాంకు రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌కు విచ్చలవిడిగా రుణాలు ఇచ్చేసింది. ఎంతలా అంటే..రుణాలు ఇచ్చి ఇచ్చి..ఆ బ్యాంకు వద్ద 97 శాతం స్థూల నిరర్ధక ఆస్తులు ఉండేంత. దీంతో బ్యాంక్ లైసెన్సును రద్దు చేస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఎంతమాత్రం బాలేదనీ, భవిష్యత్తులో కొనసాగడం కూడా కష్టమని, పైగా..సరైన పునరుద్ధరణ ప్రణాళికలు కూడా లేవు. వేరే బ్యాంకులతో విలీనం చేసే ఆస్కారం కూడా లేదని, పునరుద్ధరణకు సంబంధించి బ్యాంకు మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ‘బ్యాంకులో 97 శాతం నిరర్ధక ఆస్తులున్నాయి. మా వంతు ప్రయత్నించాం. లైసెన్స్ రద్దు కావడం దురదృష్టకరం’ అని సీకేపీ బ్యాంక్ జనరల్ మేనేజర్ మోరేశ్వర్ దైమోద్కర్ అన్నారు.

కనీసం మూలధన నిల్వలు ఉండాల్సిన నిబంధనల అంశంలో కూడా బ్యాంకు అతిక్రమించిందని, ప్రస్తుత డిపాజిటర్లు, భవిష్యత్తు డిపాజిటర్లు డబ్బులు చెల్లించే స్థితి లేదని ఆర్‌బీఐ వివరించింది. 2014 నుంచి హెచ్చరిస్తున్నప్పటికీ పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తున్నామని వెల్లడించింది. ఒకవేళ కార్యకలాపాలను కొనసాగించేందుకు గడువిస్తే..అది బ్యాంకు వినియోగదారులపై ప్రభావం చూపిస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకు లైసెన్స్ రద్దు చేసిన క్రమంలో డిపాజిటర్లు ఆందోళన పడాల్సిన అవసరంలేదని, డీఐసీజీసీ నిబంధనల ప్రకారం డిపాజిట్ చెల్లింపులు జరుగుతాయని తెలిపింది.

Tags: Banking, mumbai based bank, CKP Co-Operative Bank, RBI

Advertisement

Next Story

Most Viewed