లే.. ఓటర్ లే.. నిన్నే..!

by Shyam |   ( Updated:2020-12-01 07:06:07.0  )
లే.. ఓటర్ లే.. నిన్నే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ లో ఓటర్లు నిద్రమత్తులో జోగుతున్నట్లు ఉంది. గ్రేటర్ ఓట్లంటేనే ఓటేసేందుకు నగరవాసి ఉత్సహం చూపడం లేదు. బస్తీల్లో గుడ్డిలో మెల్లాగా ఓటింగ్ ఉన్నా.. టెకీలు, బడా బాబులు, వారి కుటుంబ సభ్యులు ఓటేయడం అంటే అదేదో తమకు సంబంధం లేని పని అన్నట్లుగా భావిస్తున్నారు. కేవలం ఓటేయడం కోసమే ప్రభుత్వం సెలవు ప్రకటించినా.. పోలీంగ్ బూత్ లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో పోలీంగ్ సిబ్బంది ఖాళీగా కూర్చోని కునికిపాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ఓటర్లు మేల్కొని ఓ అరగంట సమయం తీసుకొని ఓటేసి తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.

ఓల్డ్ సిటీ యాకుత్ పురా తలాబ్ చంచాలంలో ఓటర్లు లేక నిద్రలో ఉన్న ఎన్నికల అధికారులు

నగరంలో గత ఎన్నికలతో పోల్చితే నేటి గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ గణనీయంగా తగ్గింది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతానికి పైగా పోలింగ్ కాగా ప్రస్తుతం సాయంత్రం 4 గంటలకు కేవలం 29.76 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. మంగళవారం ఉదయం 11గంటల వరకు 9శాతం వరకే నమోదైంది. మధ్యాహ్నం 3గంటల వరకు 25.34శాతంగా ఉంది. రాజేంద్రనగర్‌లో 24.62 శాతం, చార్మినార్‌ 24.23, సంతోష్‌నగర్ 17.26, మలక్‌పేట 15.88, చాంద్రాయణగుట్ట 15.19, ఫలక్‌నుమా 17.61, మాదాపూర్ 22.70, మియాపూర్ 25.47, హఫీజ్‌పేట 20.98, చందానగర్ 21.42, కొండాపూర్ 19.64, గచ్చిబౌలి 26.56, శేరిలింగంపల్లి 23.24, సరూర్‌నగర్‌లో 26.61 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎస్‌ఈసీ పేర్కొంది.

నగర ఓటింగ్ పై కరోనా ఎఫెక్ట్ పడినట్లు కనిపోస్తోంది. లాక్ డౌన్ సమయంలో నగరంలోనే ఏళ్ల తరబడి జీవినం సాగిస్తున్న వారు సైతం గ్రామాల బాట పట్టారు. ఇదే సమయంలో వందలాది కంపెనీలు మూతపడడం, మరికొన్ని పరిశ్రమలు ఉద్యోగులను, కార్మికులను తొలగించడంతో వారంతా స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీరికి తోడు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంకా వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో వాళ్లంతా గ్రామాల్లోనే ఉండిపోయారు. ఈ కారణం చేతనే గ్రేటర్ లో ఓటింగ్ శాతం భారీగా తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed