ఆధ్యాత్మిక ట్రెండ్ సెట్టర్ కేసీఆర్.. చిన జీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
Chinna Jeeyar Swamy, Minister jagadeesh reddy
X

దిశ, సూర్యాపేట: ఆధ్యాత్మికత ట్రెండ్ సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. భక్తిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన పాలకుడు కేసీఆర్ అని కొనియాడారు. యాదాద్రి దేవాలయ పునరుద్ధరణే అందుకు నిదర్శనమన్నారు. అదే స్ఫూర్తిని మంత్రి జగదీష్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నారని అభినందించారు. సోమవారం సూర్యపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం జీర్ణోద్ధరణ పనులకు ఆయన మంత్రి జగదీష్ రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సభలో జీయర్ స్వామి మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఆధ్యాత్మికత కూడా భాగమేనని, అటువంటి ఆధ్యాత్మికతను భాగస్వామ్యం చేసినందునే తెలంగాణా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని స్పష్టం చేశారు. అధికారికంగా ఇంతకుముందెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధిలో దైవాన్ని ఒక భాగంగా మలిచిన ఘనత కూడా ఆయనదేనన్నారు. అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తోన్న మంత్రి జగదీష్ రెడ్డిని ప్రశంసించారు.

ఇటువంటి నేత ఇక్కడ పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఆయన అభివర్ణించారు. జగదీష్ రెడ్డి రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారాయన్నారు. ప్రస్తుతం జగదీష్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయం జీర్ణోద్ధరణకు పూనుకోవడం అభినందనీయమమన్నారు. శాఖాపరమైన భాగస్వామ్యం తగ్గించి ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారడంతో పాటు పట్టణం విస్తరించి ఉండడంతో దేవాలయాన్ని విస్తరించాలని, మూడేండ్ల క్రితమే నిర్ణయించామన్నారు. ఆలయంలోకి వచ్చే భక్తులకు మరింత ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాలన్నదే తమ సంకల్పం అన్నారు. అటువంటి జీర్ణోద్ధరణ పనుల శంకుస్థాపనకు చిన్నజీయర్ స్వామి హాజరు కావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed