‘‘నర్సరీ, ప్రీ ప్రైమరీ అడ్మిషన్లు రద్దు చేయాలి’’

by Shyam |   ( Updated:2020-05-04 08:52:30.0  )

దిశ, హైదరాబాద్: రానున్న విద్యా సంవత్సరానికి (2020-21) సంబంధించి ప్రయివేటు విద్యా సంస్థల్లో నర్సరీ, ప్రీ ప్రైమరీ పేర్లతో నిర్వహించే అడ్మిషన్లను రద్దు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ
మేరకు అడ్మిషన్లు చేపట్టకుండా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో రాబోయే విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమయంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు బాల, బాలికల తల్లిదండ్రులచే నర్సరీ, ప్రీ ప్రైమరీ తరగతులకు అడ్మిషన్ల నిమిత్తం డబ్బులు దండుకుంటున్నాయని చెప్పారు. పసి పిల్లలు, వయో వృద్ధులపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే హెచ్చరిస్తున్న విషయాన్ని పరిగణన‌లోకి తీసుకోవాలని కోరారు. ఒకవేళ విద్యా సంస్థలు ఓపెన్ చేసినా, విద్యార్థులు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, మన రాష్ట్రంలో అంతటి సౌకర్యాలు ఏ పాఠశాలకు , బేబీ కేర్ సెంటర్, ప్రీ స్కూల్ సెంటర్లకు లేవన్నారు. డబ్బు సంపాదనకు పదుల సంఖ్యలో పిల్లలను ఒకే గదిలో కూర్చోబెట్టడం అంటే కరోనా పరిస్థితుల్లో వారి ప్రాణాలను పణంగా పెట్టడమేనని వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి లిఖిత పూర్వకంగా పూర్వకంగా తెలిపినా ఎలాంటి స్పందన లేదని చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నర్సరీ, ప్రీ ప్రైమరీ స్కూల్ అడ్మిషన్లు నిషేధించాలని బాలల హక్కుల సంఘం మానవ హక్కుల కమిషన్‌ను కోరింది.

Tags: stop, pre primary admissions, private school, child rights association, petition, hrc, covid 19 effect

Advertisement

Next Story

Most Viewed