‘సోనూ’ సాయం ఆగలే.. మరో చిన్నారి ప్రాణం నిలబెట్టాడు

by Sridhar Babu |
‘సోనూ’ సాయం ఆగలే.. మరో చిన్నారి ప్రాణం నిలబెట్టాడు
X

దిశ, కల్లూరు : కరోనా టైంలో ప్రారంభమైన యాక్టర్ సోనూసూద్ సాయం ఇంకా ఆగలేదు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు 2021 జులై నెలలో బాబు పుట్టాడు. వీరికి సంతానం కలిగిందన్న సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. బాబుకి పుట్టుకతోనే గుండెలో సమస్య ఉందని, వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్‌కు రూ.ఆరు లక్షలు ఖర్చు అవుతుందని హైదరాబాద్‌లోని ఒక ప్రయివేటు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

చిన్నారి తండ్రి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు(తిరువూరు) సామజిక మాధ్యమాల ద్వారా సమస్యని యాక్టర్ సోనూసూద్‌కు చేరవేశారు. స్పందించిన సోనూ.. ముంబైలోని వాడియా ఆసుపత్రిలో బాబు సాత్విక్‌కు శనివారం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను చేయించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాబుకు ప్రమాదం తప్పిందని తెలియడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆపత్కాలంలో ఆదుకున్న సోనూసూద్‌కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story