‘లగ్జరీ’ బాబుల కక్కుర్తి.. రాయల్‌గా లైఫ్.. చీప్ మెంటాలిటీ

by Shyam |   ( Updated:2021-08-18 22:30:48.0  )
luxury car
X

దిశ, తెలంగాణ బ్యూరో : రూ.కోట్లు ఖర్చు పెట్టి ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తున్న లగ్జరీ బాబులు.. లక్షల పన్ను కట్టడానికి చీప్‌గా ఆలోచిస్తున్నారు. ట్యాక్స్‌లు తప్పించుకోవడం కోసం వాహనం కొనుగోలుకు పక్క రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ కొన్న కార్లతో రాష్ట్రంలో పన్నులు ఎగవేస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇటీవల రవాణా శాఖ అధికారులు ఇలాంటి వాహనాలను గుర్తించి ఫైన్లు వేస్తున్నారు. నాలుగు రోజుల కిందట 11 ఖరీదైన కార్లు చిక్కినప్పటికీ.. రాష్ట్రంలో ఇంకా వందల సంఖ్యలో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

తక్కువ ట్యాక్స్‌కు కక్కుర్తి

వాహనాలపై ట్యాక్స్‌లు ఆయా రాష్ట్రాల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఢిల్లీ, హర్యానా, పాండిచ్చేరి వంటి రాష్ట్రాల్లో దాదాపు 5 నుంచి 7 శాతం పన్నును వసూలు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరికి ఆ పన్ను 14 శాతంగా ఉంది. ప్రస్తుతం వాహనం కొనుగోలు చేసిన వెంటనే జీవిత కాల పన్నును ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అదే ఇతర రాష్ట్రాలలో కొనుగోలు చేసి రాష్ట్రానికి తెచ్చిన వాహనాలకు నిబంధనలకు అనుగుణంగా పన్నును సవరించి చెల్లించాలి. అలా చేస్తేనే రాష్ట్రంలో వాహనం రోడ్డెక్కాలని నిబంధనలు ఉన్నాయి. అయితే నగరంలో వందల వాహనాలు ఈ నిబంధనను తుంగలో తొక్కి దర్జాగా రోడ్డెక్కేస్తున్నాయి.

క్యాన్సిల్​ చేసుకుంటే తిరిగి చెల్లింపులు

ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు నిర్వహించే వారు వినియోగించే కార్లకు చాలా అవకాశాలు కల్పిస్తారు. దేశంలో ఎక్కడైనా కొనుగోలు చేసిన కారు ఒక రాష్ట్రంలో 30 రోజులు క్రమం తప్పకుండా తిరిగితే దానికి ఆ రాష్ట్రానికి సంబంధించి ట్యాక్స్‌లు చెల్లించాలి. 30 రోజుల వ్యవధిలో ఆయా ప్రాంతాలకు వెళ్తూ.. వస్తూ ఉంటే మాత్రం అవసరం లేదు. దీనికి సంబంధించిన రుజువులు సైతం చూపించాలి. కానీ రాష్ట్రంలో మాత్రం ఏండ్ల నుంచి ఖరీదైన కార్లను తిప్పుతున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారుల దృష్టికి వచ్చినా.. వాటిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు.

కాగా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ​చేయించుకుని మన రాష్ట్రంలో తిరుగుతున్న వాహనాలపై దృష్టి పెట్టారు. అయితే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్​ చేయించుకున్న వాహనాలు ఇక్కడ వాడుకునేందుకు సదరు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్​ క్యాన్సిల్ ​చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా క్యాన్సిల్ ​చేసి, ఇక్కడ రిజిస్ట్రేషన్​చేయించుకునేందుకు పత్రాలు సమర్పిస్తే ఆ రాష్ట్రంలో చెల్లించిన ట్యాక్స్‌ల సొమ్ము తిరిగి చెల్లిస్తారు. దాన్ని రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌కు బదిలీ చేస్తారు. అయినప్పటికీ కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్న కార్ల యజమానులు పన్నుల చెల్లింపుల్లో మాత్రం వెనకాడుతున్నారు.

అందరూ బడా బాబులే..

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో తిరుగుతున్న లగ్జరీ వాహనాల్లో దాదాపు 60 శాతం అంతరాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్‌పై తిరుగుతున్నాయి. అయితే ఇవన్నీ రాష్ట్రంలోని బడా బాబులవి కావటం గమనార్హం. రాష్ట్రంలో అధికంగా పన్ను వసూలు చేస్తున్నారని పన్ను తగ్గించుకునేందుకే ఇలా పక్క రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఉదాహరణగా మన రాష్ట్రంలో రూ.2 కోట్లు ఉండే కారు కొనుగోలు చేస్తే 14 శాతం ట్యాక్స్​ చెల్లించాల్సి ఉంటోంది. సగటున రూ.50 నుంచి రూ.70 లక్షల వరకు పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. అదే హర్యానా, పాండిచ్చేరి, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కొంటే కేవలం 5 నుంచి 7 శాతం పన్ను చెల్లించాలి. ఇదే రూ.2 కోట్ల విలువైన కారుకు అక్కడ రూ.25 లక్షల వరకు పన్ను ఉంటోంది. దీంతో కోట్లు ఖర్చు చేసి కొంటున్న బడా బాబులు పన్ను చెల్లించడంలో మాత్రం కక్కుర్తి చూపిస్తున్నారు.

పట్టుబడితే 200 శాతం కట్టాల్సిందే..

సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో నమోదైన బైక్‌లు, కార్లు, తదితర వాహనాలు కనీసం నెల రోజుల కంటే ఎక్కువ కాలం ఇక్కడ తిరిగితే తప్పనిసరిగా జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు స్వచ్ఛందంగా ఈ పన్ను చెల్లించాలి. కానీ చాలా మంది వాహనదారులు తాము పొరుగు రాష్ట్రాల్లో చట్టబద్ధంగానే వాహనాలను నమోదు చేసుకున్నట్లు భావించి ఇక్కడ చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. అధికారులు దీనిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి కేసులు నమోదు చేస్తున్నారు. వాహనదారులే స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తే నిబంధనల మేరకు వసూలు చేస్తామని అధికారులు చెప్పుతున్నారు. దాడుల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు పెనాల్టీల ఉంటుందంటున్నారు. కాగా రాష్ట్రంలో ఇంకా ఇలాంటి కార్లు ఉన్నట్లు సమాచారం ఉందని, లగ్జరీ వాహనాలపైన దాడులను మరింత ఉధృతం చేయనున్నట్లు డీటీసీ పాపారావు తెలిపారు. అవసరమైతే వాహనదారుల ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

ట్యాక్స్​ ఎగ్గొట్టిన ప్రముఖులు వీళ్లే..

ఇటీవల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.కోట్ల విలువైన కార్లు పట్టుబడ్డాయి. వాటికి రూ.5.5 కోట్లు జరిమానా విధించారు. వీరంతా ఇతర రాష్ట్రాల్లో కార్లను కొనుగోలు చేసి తెలంగాణ రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నారు. అధికారులకు పట్టుబడిన వారిలో కిషన్ లోహియా (హురాకన్ లంబోర్గిని), నిశాంత్ సాబు (హురాకన్‌ లంబోర్గిని), అమీర్‌శర్మ (ఫెరారీ 488), సికిందర్‌ దారేడియా (హురకిన్‌ లంబర్గిని), ముజీబ్‌ (రోల్స్ రాయిసి), నితిన్‌రెడ్డి (ఫెరారీ), రాహుల్ (ఫెరారీ), నిఖిల్ (ఫెరారీ) కార్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed