బాబు రెండు రోజుల పర్యటన ఉద్రిక్తం?

by srinivas |
బాబు రెండు రోజుల పర్యటన ఉద్రిక్తం?
X

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకు వైజాగ్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచే ఆయన పర్యటనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. విమానాశ్రయం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఎదురు చూడగా.. టీడీపీ రాజధాని నిర్ణయంపై నిరసన తెలిపేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా సిద్ధమయ్యాయి.

బాబు విమానాశ్రయం వెలుపలికి స్వాగత, వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. మరోవైపు విమానాశ్రయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కారును దుండగులు ధ్వంసం చేశారు. ఇది మరింత ఉద్రిక్తతకు కారణమైంది. మరో టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల సాయంతో బాబుకు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లగలిగారు. పెంటవాని చెరువు వద్దకు వెళ్లకుండా గండి బాబ్జీ వాహనాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

విమానాశ్రయం బయట రోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యాకర్తలు బైఠాయించి చంద్రబాబు గో బ్యాక్ నినాదాలు చేశారు. వైజాగ్‌ను సీఎం రాజధానిగా చేస్తే.. దానిని వ్యతిరేకించే చంద్రబాబుకు ఇక్కడ పర్యటించే అర్హత లేదని వారు అభ్యంతరం చెప్పారు. ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. చంద్రబాబుకాన్వాయిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముందుకు కదలనివ్వలేదు. దీంతో ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

మరోవైపు పెందూర్తి మీదుగా విశాఖపట్టణంలో నిర్వహించనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను కానీ కార్యకర్తలను కానీ అడ్డుకోవడం లేదని, కేవలం టీడీపీ కార్యకర్తలు, నేతలను మాత్రమే అడ్డుకుంటున్నారని టీడీపీ నేత భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story