Chandrababu Naidu: చంద్రబాబు కొత్త ఎన్నికల స్టంట్

by Mahesh |   ( Updated:2021-06-05 09:20:20.0  )
Chandrababu Naidu
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం, బీజేపీల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. గతంలో రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. 2014 ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్రం స్పష్టం చేయడంతో మిత్రబంధానికి చంద్రబాబు కటీఫ్ చెప్పేశారు. అంతేకాదు అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని మోడీపై విమర్శల దాడికి దిగేవారు. అదే స్థాయిలో బీజేపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగారు. పొత్తు చెడిపోవడంతో ఇరు పార్టీలు ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీ చేశాయి. కానీ జగన్ ప్రభంజనంలో రెండు పార్టీలకు చేదు అనుభవమే ఎదురైంది.

అయితే రెండేళ్ల తర్వాత టీడీపీ మహానాడులో అధినేత చంద్రబాబు బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంశాలవారీగా మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు మాటల వెనుక పెద్ద వ్యూహం ఉందని బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారంటూ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. బీజేపీకి అనుకూలంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపట్ల బీజేపీ ఘాటుగా స్పందించింది. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని తెగేసి చెప్తున్నారు.

చంద్రబాబు వెన్నుపోటుదారుడు: సునీల్ దేవధర్

చంద్రబాబును నమ్మబోయేది లేదంటూ తెగేసి చెప్తోంది. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందనేలా చంద్రబాబు మహానాడులో మరో స్టంట్‌ చేశారని.. అయితే అది ఎప్పటికీ సాధ్యం కాదని ఏపీ బీజేపీ సహాయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సారథ్యంలో బీజేపీ, జనసేన రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని దీమా వ్యక్తం చేశారు. జగన్, చంద్రబాబు అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదుగుతామంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినట్లే చంద్రబాబు ప్రధాని మోడీని సైతం వెన్నుపోటుపొడిచారని ఆరోపించారు. తాము పవన్ కళ్యాణ్‌తోనే కలిసి పయనిస్తామని తేల్చి చెప్పారు.

చంద్రబాబు ఎత్తుగడలు ఇక పారవు : విష్ణువర్ధన్‌రెడ్డి

చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ఎత్తుగడలు ఇక పారవని స్పష్టం చేశారు. తమకు ఇప్పటికే జనసేన వంటి నమ్మకమైన పార్టీతో భాగస్వామ్యం ఉందని తెలిపారు. ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో పోరాడతామని ఉద్ఘాటించారు. భవిష్యత్‌లో తాము జనసేన పార్టీతోనే ముందుకు వెళ్తామని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబుపై బీజేపీ కీలక నేతలు ఎదురు దాడికి దిగడంతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హీటెక్కాయి.

Advertisement

Next Story

Most Viewed