జగన్ తీరు మార్చుకో: బాబు లేఖ

by srinivas |
జగన్ తీరు మార్చుకో: బాబు లేఖ
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆరు అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా పేదలు, రైతులు, వ్యాపారులు పూర్తిగా కుదేలయ్యారని, అలాంటి సమయంలో విరాళాల పేరిట వైఎస్సార్సీపీ నేతలు వారిని వేధించారని ఆరోపించారు. కరోనా సహాయక చర్యలను కూడా ప్రభుత్వం రాజకీయం చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు.

25 లక్షల మందికి నగదు, సరుకులు ఇవ్వకపోవడం శోచనీయమని అంటూ, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికీ లబ్ధి చేయడమే పాలనా ధర్మమని సూచించారు. నమూనాల సేకరణ, పరీక్షలు, ఫలితాల వెల్లడిలో జాప్యం ప్రాణాంతకమని హితవు పలుకుతూ, పొంతన లేని లెక్కలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదని సూచించారు. ఓపక్క, కరోనా విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతుంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జగన్ ప్రయత్నించడం దారుణమని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త షెడ్యూలు ఖరారు చేయడానికి సీఎం అధికారులతో సమీక్షలు నిర్వహించడం సరికాదని ఆయన హితవు పలికారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కరోనా బారి నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి, ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలే సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.

Tags: chandrababu naidu, tdp, open letter, ysrcp, ap cm, ys jagan, andhrapradesh

Advertisement

Next Story

Most Viewed