కృతజ్ఞతలు చెబుతూ జగన్‌కు చంద్రబాబు లేఖ

by srinivas |
కృతజ్ఞతలు చెబుతూ జగన్‌కు చంద్రబాబు లేఖ
X

ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార పక్షంపై కారాలు మిరియాలూ నూరే ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు చెబుతూ వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. విశాఖ మెడ్ టెక్ జోన్‌లో తయారు చేసిన పీపీఈ కిట్‌ను జగన్ నిన్న క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో..

తాను దూరదృష్టితో విశాఖలో మెడ్ టెక్ జోన్ ఏర్పాటుకు కృషి చేస్తే, ఇప్పటి ప్రభుత్వం దాన్ని గుర్తించిందని పేర్కొన్నారు. ఇండియాలో తొలి మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీ కేంద్రంగా వైజాగ్‌లో మెడ్ టెక్ జోన్‌ను తాను ఏర్పాటు చేశానని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడ తయారవుతున్న సాధనాలు దాని నివారణకు ఎంతో ఉపకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో మెడ్ టెక్ జోన్ ఓ మయసభ అంటూ విమర్శించిన వాళ్లు, ఇప్పుడది దేశానికే గర్వకారణమని అంటున్నారని ఆయన తెలిపారు. మెడ్ టెక్ జోన్ గొప్పతనాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించినందుకు కృతజ్ఞతలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఈ 10 నెలల్లో మెడ్ టెక్ జోన్‌ను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. ముందే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఉంటే మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించే వాళ్లమని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు నెలకు ఐదు వేల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో ‘అన్న క్యాంటీన్’లను మూసేశారని, వాటిని తక్షణం తెరిపించి పేదల ఆకలి తీర్చాలని ఆయన సూచించారు. అలాగే చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని కూడా ఆయన లేఖలో కోరారు.

Tags: tdp, chandrababu naidu, ysrcp, ys jagan, medtech zone, visakhapatnam

Advertisement

Next Story