ట్రైలరే ఇలా ఉంటే నాలుగేళ్ల సినిమా ఎలా ఉంటుంది?: చంద్రబాబు

by srinivas |
Chandrababu
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో… ఏం సాధించారని ఉత్సవాలు చేసుకుంటారని వైఎస్సార్పీపీ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా వైఎస్సార్సీపీ ఏడాది పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే… వైఎస్సార్సీపీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి 6 నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నప్పటికీ, తొలిరోజు నుంచే ఆ పార్టీ నేతలు అరాచకాలు మొదలుపెట్టారని అరోపించారు.

ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యథేచ్ఛగా కొనసాగించారని ఆయన విమర్శించారు. సమాజానికి చెడు చేసే చర్యలను, ప్రజా వ్యతిరేక పాలనను తెలుగుదేశం పార్టీ సహించదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఎస్సార్పీ ఘోరంగా విఫలమైందని ఆయన తెలిపారు. అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజలనే నట్టేట ముంచారని ఆయన విమర్శించారు.

రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత ఇలా ఒకరేమిటి? అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారని ఆయన మండిపడ్డారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది కుటుంబాలు 164 రోజులుగా అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. న్యాయం కోసం అమరావతి ప్రజలు, విశాఖలో విషవాయు బాధితులు, మరోవైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత…ఇన్ని ప్రతి కూలతల మధ్య వైఎస్సార్సీపీ ఏడాది పాలన ఉత్సవాలా? అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

ఇంతకీ ఏం సాధించారని? ఉత్సవాలు చేస్తారు? ఎవరికేం ఒరగబెట్టారని? పండగలు నిర్వహిస్తారు? ఇకనైనా బాధ్యతగా పనిచేయండని ఆయన సూచించారు. అంతటితో ఆగని చంద్రబాబు సీఎం జగన్ ఏడాది పాలనపై ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో జగన్ పాలనలో చోటుచేసుకున్న సంఘటనలతో పాటు.. పాదయాత్ర సందర్భంగా జగన్ హామీలు, ఎన్నికల ప్రచారంలో ఒక్క చాన్స్ అంటూ ప్రజలను కోరడం, ఇటీవల వైజాగ్‌లో చోటుచేసుకున్న డాక్టర్ సుధాకర్ ఘటన చూడొచ్చు. అంతే కాకుండా అనేక పథకాలకు వైఎస్సార్ పేరు తగిలించి కొత్త పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది పాలన ట్రైలరే ఇలా ఉంటే… నాలుగేళ్ల పాలనలో చుక్కలు చూపిస్తారని ఆయన విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed