కరోనాకు కళ్లెం.. భారత్‌ ముందడుగు

by Anukaran |
కరోనాకు కళ్లెం.. భారత్‌ ముందడుగు
X

న్యూఢిల్లీ: కరోనాకు కళ్లెం వేయడానికి భారత్‌లో కీలక ముందడుగు పడింది. ప్రపంచమంతా ఆతృతగా చూస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్‌ భారత్‌లో నిర్వహించడానికి పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు కేంద్రం అనుమతినిచ్చింది. రెండు, మూడో దశ హ్యూమన్ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశంలోని సుమారు 20 సైట్‌లలో ఈ ట్రయల్స్ నిర్వహించడానికి ఎస్ఐఐ సన్నద్ధమవుతున్నది. దాదాపు 1,600 మందికి వ్యాక్సిన్ ప్రయోగించి ఈ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. ఈ నెలలోనే ట్రయల్స్ ప్రారంభిస్తామని సంస్థ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్, జైదుస్ కాడిలా టీకాల కంటే ఆక్స్‌ఫర్డ్ టీకా ముందంజలో ఉండనుంది. ప్రస్తుతం ఈ రెండు టీకాలు మొదటి దశ ట్రయల్స్‌లో ఉన్నాయి. కానీ, సీరం నేరుగా రెండు, మూడు దశల ట్రయల్స్ నిర్వహించనున్నది.

స్వీడిష్-బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా ప్రపంచంలోనే ముందువరసలో ఉండి ఆశాజనక ఫలితాలనిస్తున్నది. ఈ టీకా విజయవంతమైతే తయారీ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారుదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ ఈ టీకా అందుబాటులో తేవడానికి ఎస్ఐఐ 2,3 దశల హ్యూమన్ ట్రయల్స్ నిర్వహణకు దరఖాస్తు చేసుకుంది. పలువిషయాల్లో అభ్యంతరాలు తెలిపిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ(ఎస్ఈసీ) ఎనిమిది సవరణలు చేయాల్సిందిగా ఎస్ఐఐకి సూచనలు చేసింది. సవరించిన ప్రతిపాదనలను పరిశీలించి ఆక్స్‌ఫర్డ్ టీకా(కొవిషీల్డ్) 2+3 ట్రయల్స్‌కు భారత్‌లో ఎస్ఐఐకి అనుమతినివ్వాలని శుక్రవారం రికమెండ్ చేసింది. అంతేకాదు, ఎస్ఐఐ నిర్వహించనున్న టీకా క్లినికల్ ట్రయల్స్, అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్‌ల డేటాను పరిశీలించాలని, అటుతర్వాత కొవిషీల్డ్ టీకాను భారత్‌లో మార్కెట్ చేసుకోవడానికి ఎస్ఐఐకి అనుమతినివ్వాలని కోరింది. ఎస్ఈసీ సిఫార్సుల తర్వాత తాజాగా, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఎస్ఐఐకి అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ట్వీట్ చేసి సోమవారం వెల్లడించింది.

కొవిషీల్డ్ టీకాపై పూణె, ముంబయిలలో ట్రయల్స్ జరుగుతాయని ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా గతంలో ప్రకటించినప్పటికీ తాజా సవరణల్లో దేశంలోని 20 ఫెసిలిటీల్లో ట్రయల్స్ నిర్వహించనున్నట్టు సంస్థ పేర్కొంది. ట్రయల్స్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగాలని ఎస్ఈసీ సూచనలను సంస్థ అంగీకరించింది. ట్రయల్స్‌లో పార్టిసిపెంట్ల సంఖ్యపైనా స్పష్టతనివ్వాలని, రెండు దశల ట్రయల్స్ మధ్య తేడా స్పష్టంగా ఉండాలని ఎస్ఈసీ సూచించింది. అలాగే, ట్రయల్స్‌లోనూ కేవలం పార్టిసిపెంట్‌లలో ఇమ్యూనిటీ రెస్పాన్స్‌ను పరీక్షించడం కాదు, సెల్యూలర్ ఇమ్యూన్ రెస్పాన్స్‌ను పరిశీలించాలని సూచనలు చేసింది. సెల్యూలర్ ఇమ్యూనిటీలో వైరస్‌ను తుత్తునియలు చేసే తెల్లరక్త కణాల్లోని టీ సెల్స్ అభివృద్ధినీ పరిశీలించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed