వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు!

by vinod kumar |
వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు!
X

న్యూఢిల్లీ : కరోనావైరస్‌తో ముందుండి పోరాడుతున్న వైద్యులపై దాడిని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. డాక్టర్లపై దాడులను నిరసిస్తూ.. ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసొసియేషన్(ఐఎంఏ) 23న ‘బ్లాక్ డే’ పాటించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐఎంఏ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు బుధవారం భేటీ అయ్యారు. కరోనా ఆపత్కాలంలో వైద్యుల సేవలను ప్రశంసిస్తూ.. వారి రక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, అమిత్ షాలు వైద్యులకు హామీనిచ్చారు. ఈ హామీతో వైద్యులు తమ నిరసన ప్రదర్శన ప్రణాళికను ఉపసంహరించుకున్నారు. అనంతరం స్వల్పవ్యవధిలోనే వైద్యులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం.. చట్టాన్ని సవరించింది. వైద్యులపై దాడిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ ఎపిడెమిక్ యాక్ట్‌కు సవరణలు చేసింది. ఈ నేరానికి కనిష్టంగా ఆరు నెలల నుంచి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, అలాగే, కనిష్టంగా రూ. 50వేల నుంచి ఐదు లక్షల వరకు జరిమానాను విధించనుంది. ఆశావర్కర్లు సహా వైద్యులు, నర్సులు, హెల్త్ వర్కర్లు, అటెండెంట్స్‌లకు రక్షణ కల్పించే ఎపిడెమిక్ యాక్ట్‌ను సవరించి మరింత కఠినం చేసినట్టు కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడించారు. దేశమంతా వైద్యుల సేవలను స్తుతిస్తుంటే.. కొందరు మాత్రం డాక్టర్‌లే వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారన్న తప్పుడు ఆలోచనలతో వారిపైనే దాడికి తెగబడుతున్నారని అన్నారు. అలాంటివారి పట్ల తమకు ఎటువంటి దయాదాక్షిణ్యాల్లేవని, నాగరిక సమాజంలో వైద్యులపై దాడులను ఉపేక్షించలేమని చెప్పారు.

Tags: health workers, amendment, centre, tough law, doctors, protest, prison term

Advertisement

Next Story

Most Viewed