- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలసకార్మికుల రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
దిశ, న్యూస్‌బ్యూరో: రెండో విడత లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తూ ఉంది. ఇప్పటికే సడలింపులకు సంబంధించి ఐదు ఉత్తర్వులను జారీ చేసిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళడానికి కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా అన్ని రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులు ఇప్పుడు కొన్ని షరతులకు లోబడి స్వస్థలాలకు రోడ్డుమార్గం గుండా వెళ్ళేందుకు అనుమతి ఇచ్చింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం ఉండాలన్న షరతు విధించింది. దీనికి తోడు వారిని ఒకచోటి నుంచి మరో చోటుకు తరలించేటప్పుడు వైరస్ వ్యాప్తి నివారణకు అవలంబించాల్సిన నిబంధనలను కూడా పాటించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ భల్లా బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లాక్‌డౌన్ అమలులోకి వచ్చి నెలన్నర రోజులు అవుతున్నా ఇంకా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కాలి నడకన వందలాది మంది తరలి వెళ్తూనే ఉన్నారు. రోడ్డుమార్గం గుండా వెళ్తున్న వీరిని ఆయా రాష్ట్రాల్లో పోలీసులు అడ్డుకుంటుండడంతో పొలాలమీదుగా, అడవి దారుల్లో, చివరకు రైలు పట్టాల వెంట వెళ్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా ఈ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.
కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల ప్రకారం వలస కార్మికులు ప్రస్తుతం వారు చిక్కుకుని ఉన్న రాష్ట్రం నుంచి స్వస్థలాలకు వెళ్ళాలంటే ముందుగా వీరిని గుర్తించడం, రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన, అంగీకారం కుదరడం తప్పనిసరి. ఇందుకోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సంప్రదింపులు జరపాలని హోంశాఖ సూచింది. వలస కార్మికులకు మాత్రమే కాక విద్యార్థులు, పర్యాటకులు, యాత్రికులు, కొన్ని సందర్భాల్లో వివిధ పనులమీద వెళ్ళిన విడివిడి వ్యక్తులు.. ఇలా ఏ కారణంగా చిక్కుకుపోయినా వారికి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
ఆ ఉత్తర్వుల్లోని కొన్ని ముఖ్యాంశాలు :
– ప్రతీ రాష్ట్రం వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఒక నోడల్ అధికారిని నియమించాలి. స్పష్టమైన ప్రోటోకాల్‌ను రూపొందించుకోవాలి. పంపడానికి మాత్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారిని తీసుకోడానికి కూడా ఇది వర్తిస్తుంది. అలాంటి వ్యక్తులందరి వివరాలను నమోదు చేయాలి.
– ఒకవేళ విడివిడి వ్యక్తులుగా కాకుండా సమూహంగా ఉన్నవారిని తరలించాల్సి వచ్చినా తీసుకోవాల్సి వచ్చినా ముందుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరగాలి. పరస్పర అంగీకారం కుదరాలి. ఆ తర్వాత రాకపోకలకు వీలుగా రవాణా వ్యవస్థను సమకూర్చాలి.
– వస్తున్న, పోతున్న వ్యక్తుల ఆరోగ్య స్థితిగతుల్ని పరిశీలించాలి. కరోనా లక్షణాలు లేనివారినే అనుమతించాలి.
– రాష్ట్రాలు ఏర్పాటు చేసే బస్సుల్ని ముందుగా శానిటైజ్ చేయాలి. బస్సులో ప్రయాణించేటప్పుడు సోషల్ డిస్టెన్స్ నిబంధనలను పాటించాలి.
– ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఇలాంటి బస్సులు వెళ్తున్నప్పుడు కొన్ని ఇతర రాష్ట్రాల మీదుగా వెళ్ళాల్సి రావచ్చు. అలాంటప్పుడు మార్గమధ్యంలోని రాష్ట్రాలు సైతం అనుమతించాలి.
– ప్రయాణం చేసి వచ్చినవారిని తీసుకునేటప్పుడు స్థానికంగా ఉండే ఆరోగ్యశాఖ సిబ్బంది వారి ఆరోగ్యాన్ని పరీక్షించాలి. ఇంటికి చేరుకున్న తర్వాత విధిగా హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అర్థం చేయించాలి. అవసరమైనవారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించాలి. నిత్యం వారి ఆరోగ్య స్థితిని తెలుసుకుంటూ ఉండాలి. ఇందుకోసం ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందిగా వారికి సూచించాలి. ఆ ప్రకారం వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి వీలవుతుంది.
Tags: MHA, Migrant Labourers, Transportation, State Governments, Quarantine