కేంద్రమంత్రి సంచలన కామెంట్స్.. ఈటల దంపతులను జైల్లో పెట్టేందుకు కుట్ర

by Sridhar Babu |   ( Updated:2021-10-25 08:13:11.0  )
కేంద్రమంత్రి సంచలన కామెంట్స్.. ఈటల దంపతులను జైల్లో పెట్టేందుకు కుట్ర
X

దిశ, హుజురాబాద్ : ఈటల దంపతులను జైల్లో పెట్టాలనే కుట్రలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం పోలీసులచేత అక్రమ కేసులు నమోదు చేయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిర్సపల్లి, రాంపూర్, చెల్పూర్ గ్రామాల్లో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కుటుంబ పాలనను ప్రశ్నించి కేసీఆర్ పల్లకి మోయనందుకే ఈటలపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. నియోజక వర్గ ప్రజలు అండగా ఉంటారనే నమ్మకంతో అవమానాలు తట్టుకోలేక ఆత్మగౌరవం కోసం ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. వందలాది మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో కుటుంబ పాలన సాగుతున్నదన్నారు.

పార్టీలకు అతీతంగా సబ్బండ వర్ణాలు చేసిన ఉద్యమాలు, ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఇందుకు సంపూర్ణ మద్దతు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అడుగులకు మడుగులు ఒత్తేవారు తప్పా కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి అక్రమాలు ఎదిరించే వారికి టీఆర్ఎస్ పార్టీలో స్థానం లేదన్నారు. సొంత పార్టీ నాయకులను కొన్నట్టే డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను చైతన్య వంతులైన హుజురాబాద్ ప్రజలు తిప్పికొడుతారన్నారు.

స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మనీ, మద్యం, బీరు, బిర్యానీలు పంపిణీ చేసే స్థాయికి దిగజారారని విమర్శించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు తలొగ్గకుండా నీతి, నిజాయితీ కలిగి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన ఈటల రాజేందర్‌ను గెలిపించి పులిబిడ్డలుగా నిరూపించుకోవాలని కిషన్ రెడ్డి హుజురాబాద్ ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన చెల్పూర్ దళిత కాలనీలో సహాపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఆలుమల్ల శ్యామసుందర్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed