నిజాం కల్చర్ నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం

by Shyam |   ( Updated:2020-11-29 04:48:57.0  )
నిజాం కల్చర్ నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రచార సమయంలో హైదరాబాద్ ప్రజల స్పందన బాగుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తాము సీట్లు పెంచుకోవడానికి పోటీ చేయడం లేదని, మేయర్ సీటే మా టార్గెట్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్లలో ఒక్క నాలాను కూడా క్లీన్ చేయలేదని, మజ్లిస్ పార్టీ అండతో హైదరాబాద్ లో అక్రమాలు బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వలన మొన్న వచ్చిన వరదల్లో చాలా భాగం ముంపునకు గురైందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని తమకు అప్పగిస్తే అక్రమ కట్టడాలు అన్నీ కూల్చివేసి, నగరంలోని రోడ్లపై నీరు నిలవకుండా చేస్తామన్నారు.

వరదల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం అడుగు కూడా బయటపెట్టలేదని అమిత్ షా విమర్శించారు. మేం ఏం చెప్పామో.. అది ఖచ్చితంగా చేస్తామని షా స్పష్టంచేశారు.కేసీఆర్ చెప్పిన వంద రోజుల ప్రణాళిక సంగతి ఏమైందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. లక్ష ఇళ్లు కట్టిస్తామని చెప్పి గడచిన ఆరేళ్లలో 11వేల ఇళ్లు కూడా కట్టలేదని కేంద్ర హోంమంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యం కోసం మోడీ ఆయుష్మాన్ భారత్ స్కీం తీసుకొస్తే.. అందులో కావాలని చేరలేదన్నారు. పీఎం స్ట్రీట్ వెండర్స్ యోజనతో హైదరాబాద్ లో 30లక్షల మందికి రుణాలిచ్చామని వెల్లడించారు. తెలంగాణకు వారసత్వ రాజకీయాలు కాదు.. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన అవసరమని అమిత్ షా నొక్కి చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే మజ్లిస్ తో రహస్య పొత్తు ఎందుకు పెట్టుకుందని ఆయన అడిగారు. ఈ ఎన్నికల్లో నగర ప్రజలు బీజేపీకి అవకాశమిస్తే పారదర్శకంగా పాలన చేసి చూపిస్తామన్నారు.

Advertisement

Next Story