పట్టువీడని రైతులు.. దిగొస్తున్న కేంద్రం

by Shamantha N |   ( Updated:2020-12-30 11:25:57.0  )
పట్టువీడని రైతులు.. దిగొస్తున్న కేంద్రం
X

న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాల రద్దు కోసం ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఆరో దఫా చర్చలు పురోగతి సాధించాయి. ఎజెండాలో రైతులు సూచించిన నాలుగు డిమాండ్లకుగాను రెండింటి మధ్య ఏకాభిప్రాయం ఏర్పడింది. ఈ చర్చలూ సశేషంగానే ముగిశాయి. కీలకమైన మిగతా రెండు డిమాండ్లపై వచ్చే నెల 4న మరోసారి చర్చకు కూర్చోనున్నాయి. 41 రైతు నేతలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర ఆహార, రైల్వే శాఖ మంత్రి పియూశ్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్‌లు ఢిల్లీలోని విజ్ఞా్న్ భవన్‌లో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పవర్ టారీఫ్‌ను పెంచే ఎలక్ట్రిసిటీ చట్టం, పంట వ్యర్థాలను కాల్చినవారికి పెనాల్టీలకు సంబంధించిన సమస్యలపై ఉభయుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

రెండు డిమాండ్లకు సంబంధించి రైతుల లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చర్చ అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ చర్చల్లో 50శాతం సమస్యలను పరిష్కరించిందని పేర్కొన్నారు. మూడు చట్టాలు, కనీస మద్దతు ధరకు సంబంధించిన సమస్యలపై జనవరి 4న నిర్వహించే ఏడో దఫా చర్చల్లో మాట్లాడుతామని వివరించారు. పంట వ్యర్థాల కాల్చివేత, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలకు నేటి చర్చల్లో పరిష్కారం లభించిందని, తమ కీలకమైన రెండు సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని భారతీయ కిసాన్ యూనియన్ రాకేశ్ తికాయిత్ భేటీ అనంతరం తెలిపారు.

సమావేశానికి ముందు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కొత్త చట్టాలు అమలవుతున్న ఉత్తరప్రదేశ్‌లో రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకోవాల్సి వస్తున్నదని, ఈ విషయాన్ని చర్చల్లో లేవనెత్తుతామని అన్నారు. జనవరి 4న జరిగే తదుపరి సమావేశంలో వీటిపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఆందోళనలు చేస్తున్న రైతుల ప్రధాన డిమాండ్ మూడు నూతన సాగు చట్టాల రద్దు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ రెండో కీలక డిమాండ్. ఈ రెండు ప్రధాన డిమాండ్లపై చర్చలే వాయిదా పడ్డాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన విమరించబోమని రైతులు తెగేసి చెబుతుండగా, వాటిని ఉపసంహరించబోమని కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెబుతున్నది. అవసరమైతే సవరణలు చేస్తామని ప్రతిపాదించినా రైతులు తిరస్కరించారు. ఈ విషయమై రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటి వరకు ఆరు సార్లు చర్చలు జరిగాయి. కానీ, నిష్ఫలితంగా ముగిశాయి.

లంగర్ ఆహారం.. రైతులు.. కేంద్ర మంత్రులు

ఐదుగంటలపాటు సాగిన చర్చల మధ్యలో రైతులు, కేంద్ర మంత్రులు కలిసి లంగర్ భోజనాన్ని తిన్నారు. విజ్ఞాన్ భవన్‌లో చర్చలు ప్రారంభమైన సుమారు రెండు గంటల తర్వాత రైతులు, కేంద్ర మంత్రులు బ్రేక్ తీసుకున్నారు. అప్పుడే లంగర్‌(కమ్యూనిటీ కిచెన్) ఆహారం ఓ వ్యాన్‌లో విజ్ఞాన్ భవన్ చేరుకుంది. రైతులు అరేంజ్ చేసిన ఈ ఆహారాన్ని రైతులతోపాటు కేంద్ర మంత్రులూ తిన్నారు.

Advertisement

Next Story