- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులతో వాడివేడిగా చర్చలు
న్యూఢిల్లీ: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిదో దఫా చర్చల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ, మూడు సాగు చట్టాల రద్దు డిమాండ్‌నే రైతులు పునరుద్ఘాటించగా, కేంద్ర ప్రభుత్వమూ తన వాదనను మళ్లీ వినిపించింది. చట్టాల్లో అభ్యంతరకర అంశాలను సవరించడానికి సిద్ధమని, ఆ ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవడానికి సాగు చట్టాలను కూలంకశంగా అర్థం చేసుకున్న రైతు నేతలతో ఒక కమిటీ వేసుకోవాలని సూచించింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూశ్ గోయల్, సోమ్ ప్రకాశ్‌లు 40 రైతు సంఘాల ప్రతినిధులతో శుక్రవారం సుమారు ఐదు గంటలపాటు చర్చలు జరిపారు. రైతు ఆందోళనలకు పరిష్కారాన్ని చూపించే లక్ష్యంతో ఉభయ పక్షాల వాదనలు వినడానికి సుప్రీంకోర్టు నిపుణులతో ప్రత్యేక కమిటీ వేసిన తర్వాత జరిగిన తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఈ కమిటీ ముందు తాము హాజరుకాబోమని, కేంద్ర ప్రభుత్వంతో నేరుగానే చర్చలు కొనసాగిస్తామని రైతు సంఘాల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వమూ రైతులతో చర్చలు కొనసాగించడానికి సిద్ధమని తెలిపింది. తదుపరి చర్చలు ఈ నెల 19న 12 గంటలకు నిర్వహిస్తామని పేర్కొంది.
రైతులతో చర్చలు సుహృద్భావవాతావరణంలో జరిగాయని, కానీ, వారు పట్టువిడవాల్సిన అవసరముందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. చట్టాల్లో అభ్యంతరకర విషయాలను చర్చిస్తే వాటిని సవరించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. రైతు సంఘాల్లోనే చట్టాలపై పట్టున్నవారు ప్రత్యేక కమిటీగా ఏర్పడాలని, చట్టాల్లో అభ్యంతరాలను వారు క్రోడీకరించాలని సూచించారు. తద్వారా వాటిని సవరించి ఆందోళనలకు ఫుల్‌స్టాప్ పెట్టవచ్చునని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కమిటీ వేసినప్పటికీ రైతులతో నేరుగా చర్చలు కొనసాగించడానికి అభ్యంతరమేమీ లేదని స్పష్టం చేశారు. సుప్రీం కమిటీ పిలిచినప్పుడూ వారి ముందూ హాజరవుతామని తెలిపారు. తద్వారా ఏదో ఒక మార్గంలో రైతుల సమస్యలకు పరిష్కారం లభించవచ్చునని పేర్కొన్నారు.