హుజురాబాద్‌కు కేంద్ర బలగాలు.. ఇప్పటికే చేరుకున్న 3 కంపెనీలు

by Sridhar Babu |
Central forces
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఊహించినట్లుగానే హుజురాబాద్‌కు కేంద్ర బలగాలు చేరుకుంటున్నాయి. మొత్తం 20 కంపెనీల (రెండు వేల మంది) బలగాలను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోగా ఇప్పటికే మూడు కంపెనీలు చేరుకున్నారు. త్వరలోనే మరో 17 కంపెనీలు చేరుకోనున్నాయి.

రాష్ట్ర పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పోలింగ్ పారదర్శకంగా, ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలను పంపాల్సిందిగా మూడు రోజుల క్రితం బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకుని మొత్తం 20 కంపెనీల బలగాలను పంపాలని నిర్ణయం తీసుకున్నది. నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్నదంటూ ఎలక్షన్ కమిషన్‌కు అందిన ఫిర్యాదు మేరకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో తిరుగుతున్న వ్యయ పరిశీలకులకు అదనంగా ప్రత్యేకంగా మరో అబ్జర్వర్‌ను పంపుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు.

ఇప్పటివరకు నియోజకవర్గంలో రూ.1.80 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని, ఈ డబ్బుకు నిర్దిష్టంగా లెక్కలు లేవని తెలిపారు. దీనికి తోడు రూ.6.11 లక్షల విలువైన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. హుజురాబాద్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తున్నామని, దానికి అనుగుణంగానే వారు నిర్ణయాలు తీసుకుని తమకు ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed