- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బట్టీపట్టే చదువులకు ఇకపై స్వస్తి..
న్యూఢిల్లీ : భారత విద్యా విధానంలో నూతన శకానికి కేంద్ర ప్రభుత్వం నాందీ పలికింది. 21వ శతాబ్దికి అవసరమైన విజ్ఞానసమూపార్జనకు, ప్రపంచస్థాయి ప్రమాణాలకు దీటుగా సరికొత్త ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 34 ఏళ్ల తర్వాత భారత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు సిద్ధమైంది. ఇస్రో మాజీ చీఫ్ కె కస్తూరిరంగన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ) 2020కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రీ-ప్రైమరీ మొదలు ఉన్నత విద్య వరకు సమూలమార్పులకు శ్రీకారం చుట్టింది. చివరిసారిగా భారత్ 1986లో విద్యా విధానాన్ని రూపొందించగా, 1992లో అప్‌డేట్ చేసింది. దేశంలో యువత 100శాతం అక్షరాస్యులు కావడానికి ఎన్ఈపీ 2020 ఉపకరిస్తుందని, విద్యారంగానికి ప్రభుత్వ నిధులను జీడీపీలో 4.3శాతం నుంచి ఆరుశాతానికి పెంచనున్నట్టు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖారే తెలిపారు.
పాఠశాల విద్యలో మార్పులేంటీ?
ఇప్పటి వరకు ఉన్న 10+2 విధానానం స్థానంలో 5+3+3+4 పద్ధతి రానుంది. ప్రస్తుతమున్న ఇంటర్మీడియెట్ వరకు మొత్తం 12 గ్రేడ్‌లుగా విభజించింది. తొలి ఐదు గ్రేడు(విద్యార్థి వయసు ఐదు నుంచి ఎనిమిదేళ్లు)లలో అంగన్‌వాడీ, ప్రీస్కూల్, సహా రెండో తరగతి వరకు ఇమిడి ఉంటాయి. దీన్ని వ్యవస్థాపక దశ(ఫౌండేషనల్ స్టేజ్)గా పేర్కొంది. ప్రీ-ప్రైమరీ దశలో మూడు గ్రేడులు(ఎనిమిది నుంచి 11 ఏళ్లు), తర్వాతి సన్నద్ధత దశ(ప్రిపరేటరీ స్టేజ్)లో మూడు గ్రేడులు(11 నుంచి 14 ఏళ్లు), సెకండరీ స్టేజ్(14నుంచి 18ఏళ్లు)లో చివరి నాలుగు గ్రేడులుగా పాఠశాల విద్యను నూతన విద్యా విధానం విభజించింది. తత్ఫలితంగా నిర్బంధ విద్యను 3నుంచి 18ఏళ్లకు పెంచింది. గతంలో 14ఏళ్ల వరకే ఉండేది.
5వ గ్రేడ్ వరకు మాతృభాషే..
5వ గ్రేడ్ వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే బోధన ఉండాలి. ఎనిమిదో గ్రేడ్ అటు తర్వాత కూడా స్థానిక భాష లేదా మాతృభాషలోనే బోధించాలని సూచించింది. అన్ని స్థాయిల్లోనూ సంస్కృతం అందుబాటులో ఉంటుంది. త్రిభాషా విధానంలో ఇది ఒక భాషగా ఉంటుంది. ఇతర ప్రధాన భాషలు, భారత సాహిత్యం అందుబాటులో ఉంటుంది. ఎనిమిదో గ్రేడ్ తర్వాత విదేశీ భాషలు ఎంచుకునే అవకాశమూ విద్యార్థులకు ఉంటుంది. అయితే, ఏ భాష ఒకరిపై రుద్దే విధానాన్ని అనుసరించదని ఎన్ఈపీ2020 పేర్కొంది.
అన్ని విషయాల్లో నైపుణ్యమే లక్ష్యం
స్కూలింగ్ నుంచే అన్ని విషయాలపై బేసిక్ అవగాహన, నైపుణ్యం కలిగి ఉండేలా బోధనాంశాలుంటాయి. 21వ దశాబ్ది నైపుణ్యాలను నేర్పించేలా గుదిబండలాగా మారిన సిలబస్‌ను కుదించి సునిశిత ఆలోచన శక్తి, అనుభూతి ద్వారా నేర్చుకోవడంపై శ్రద్ధ పెట్టింది. సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడంపైనా విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది. ఆర్ట్స్-సైన్సెస్, కరికులర్-ఎక్స్‌ట్రా కరికులర్, వొకేషనల్-అకడమిక్‌లని నిర్ధిష్ట తేడాలు ఉండబోవు. ఆరో గ్రేడ్ నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్ మొదలవుతుంది. ఇంటర్న్‌షిప్పులూ ఉంటాయి.
పరీక్షల్లోనూ మార్పులు
బట్టీ విధానానికి స్వస్తి పలికి నాలెడ్జ్ అప్లై చేసే పరీక్షా విధానానికి శ్రీకారం చుట్టనున్నది. విశ్లేషణ, తులనాత్మక పరిశీలన విధానాల్లో విద్యార్థలు ప్రతిభను అంచనా వేయనున్నారు. డిస్ట్రిప్లివ్, ఆబ్జెక్టివ్ విధానాల్లో పరీక్షా పత్రాలుంటాయి. గ్రేడ్ 3,5,8 విద్యార్థులకు పరీక్షలుంటాయి. గ్రేడ్ 10, 12 విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి. విద్యార్థుల ప్రదర్శనను అంచనా వేయడానికి ప్రత్యేకంగా అసెస్‌మెంట్ సెంటర్.. పరాఖ్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తుంది.
వెనుకబాటుకు విరుగుడుగా..
విద్యలో బాలురు, బాలికలకు సమాన సాధికారత సాధించడానికి ఎన్ఈపీ కీలక ప్రతిపాదనలు చేసింది. జెండర్ ఇంక్లూజన్ ఫండ్ ఏర్పాటుకు సూచించింది. ప్రాంతం, ఇతర కారణాలతో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు కల్పించనుంది. వికలాంగులకు, ప్రత్యేక శిక్షణ, రీసోర్స్ సెంటర్‌ల ఏర్పాటు, సరిపడా సాంకేతికతను సమకూర్చుకోవడం వంటి నిర్ణయాలున్నాయి.
ఉన్నత విద్యలో మార్పులు ఇవి..
ఉన్నత విద్యలో అండర్ గ్రాడ్యుయేషన్‌కు గణనీయమైన మార్పులు చేసింది. ప్రస్తుతమున్న మూడేళ్ల డిగ్రీతోపాటు నాలుగేళ్ల మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టనుంది. ఈ ప్రోగ్రామ్ కచ్చితంగా చివరి వరకు చదవాలని లేదు. ఏ ఏడాదైనా కోర్సు నుంచి ఉపసంహరించుకోవచ్చు. ఆయా ఏడాదిని బట్టి వారి చదువుకు గుర్తింపుంటుంది. ఉదాహరణకు తొలి ఏడాదే కోర్సు నుంచి నిష్క్రమిస్తే సర్టిఫికెట్ కోర్సుగా, రెండో ఏడాది విరమించుకుంటే డిప్లమాగా, మూడో ఏడాదైతే బ్యాచిలర్స్ డిగ్రీగా గుర్తింపు ఉంటుంది. నాలుగో సంవత్సరం కూడా పూర్తిచేస్తే మల్టీ డిసిప్టినరీ డిగ్రీ పట్టా వస్తుంది. అందులోనూ కఠినమైన రీసెర్చ్ ప్రాజెక్టు చేస్తే రీసెర్చ్ డిగ్రీ లభిస్తుంది. ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ)ను రద్దు చేయనుంది. అయితే, ప్రస్తుతమున్న ట్రెడిషనల్ బీఏ, బీఎస్సీలాంటి కోర్సులు కొనసాగుతాయి. ప్రాపంచిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అన్ని విషయాలపై అవగాహన కలిగేలా సబ్జెక్టులుంటాయి.
క్రెడిట్ బ్యాంక్ అంటే?
ఇలా ఏ కోర్సులో నుంచైనా విరమించుకోవడం ఎందులోనైనా చేరే అవకాశమివ్వడంతో డిగ్రీలు అందించడంపై గందరగోళం ఏర్పడవచ్చు. అందుకే వారు చదివిన కోర్సుకు, కాలానికి తగిన క్రెడిట్లుంటాయి. పలు ఉన్నత విద్యా సంస్థల్లో ఇలా సంపాదించుకున్న క్రెడిట్లను డిజిటల్‌గా ఏర్పాటు చేసిన క్రెడిట్ బ్యాంకులో రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీకి సరిపడా క్రెడిట్లు సంపాదించిన తర్వాత ఉన్నత విద్యాసంస్థ నుంచి పట్టా పొందవచ్చు.
సింగిల్ రెగ్యులేటరీ బోర్డు
ఉన్నత విద్యాసంస్థలన్నింటినీ పర్యవేక్షించడానికి ఇకపై ఒకే రెగ్యులేటర్ ఉండనుంది. ప్రస్తుతమున్న యూనిర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) స్థానంలో భారత ఉన్నత విద్యా మండలి(హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా-హెచ్ఈసీఐ) ఏర్పడనుంది. ఈ మండలిలో నాలుగు ప్రత్యేక విభాగాలుంటాయి. రెగ్యులేషన్ కోసం నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, ప్రమాణాల కోసం జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఫండింగ్ కోసం హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, అక్రెడిషన్ కోసం నేషనల్ అక్రెడిషన్ కౌన్సిల్ ఉంటాయి. అయితే, లీగల్ జ్యురిస్డిక్షన్ లేకపోవడం గమనార్హం.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్), వెటిరినరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ), కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీవోఏ), నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీవీఈటీ)సహా పలు ప్రొఫెషన్ కౌన్సిళ్లు ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీ(పీఎస్ఎస్‌బీ)లుగా వ్యవహరిస్తాయని కేంద్రం పేర్కొంది.
కాలేజీల్లోనూ మార్పులు..
ఇక దేశవ్యాప్తంగా భిన్న కాలేజీలుండబోవు. అన్ని మల్టీ డిసిప్లినరీ కళాశాలలు మాత్రమే ఉంటాయి. అంటే ప్రస్తుతమున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేక కాలేజీలు, సైన్సెస్‌కు ప్రత్యేక కాలేజీలుండవు. వీటన్నింటిని క్రమంగా అన్ని సబ్జెక్టులు అందించే మల్టీ డిసిప్లినరీ కాలేజీలుగా మార్చనుంది. ఇటువంటి కాలేజీలను నిర్ధిష్ట కాలంలో రూపుమార్చనుంది. అఫిలియేట్ కాలేజీలు 15 ఏళ్లలో మల్టీ డిసిప్లినరీలుగా మారాల్సిందే. వీటిని గ్రేడెడ్ అటానమస్‌లు క్రమంగా ఎదిగేలా చర్యలుంటాయి. మొత్తంగా ఇవి అటానమస్ కాలేజీలు లేదా యూనివర్సిటీ విభాగాలుగా ఉంటాయి. టెక్నికల్ యూనివర్సిటీలు, హెల్త్ సైన్సెస్, లీగల్, అగ్రికల్చరల్ సహా పలు విధాల యూనివర్సిటీలు 2040కల్లా మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా మారనున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలూ ఆర్ట్స్, హ్యూమనిటీస్ సహా ఇతర విషయాలు భోదిస్తూ సమగ్ర రూపాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ట్స్, హ్యూమనిటీస్ విద్యార్థులకు సైన్స్, సైన్స్ విద్యార్థులకు ఆర్ట్స్, హ్యూమానిటిస్ నేర్చుకునేలా 2040 కల్లా మార్పులుంటాయి. కాగా, 2030 వరకు ఇలాంటి మల్టీ డిసిప్లినరీ సంస్థ ప్రతి జిల్లాలో ఒకటి ఉండేలా అభివృద్ధి చర్యలుంటాయని కేంద్రం పేర్కొంది. భాషలు, సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం, ఇండాలజీ, కళ, నృత్యం, థియేటర్ ఎడ్యుకేషన్, ప్యూర అండ్ అప్లైడ్ సైన్సెస్, సోషియాలజీ, ఎకనామిక్స్, స్పోర్ట్స్, ట్రాన్స్‌లేషన్ సహా ఇతర విషయాలు అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ఉంటాయి. అన్ని విద్యా సంస్థల్లోకి ప్రవేశానికి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఐచ్ఛికమే, తప్పనిసరి కాదు.
50శాతం ఎన్‌రోల్‌మెంట్ లక్ష్యం..
2035 కల్లా ఉన్నత విద్యలో 50శాతం ఎన్‌రోల్‌మెంట్ సాధించడమే ఎన్ఈపీ 2020 లక్షించింది. దీనికోసం సుమారు 3.5కోట్ల కొత్త సీట్లకు అవకాశం కల్పించనుంది. 2018కి ఇది 26.3శాతమున్నది. ఈ ఎన్‌రోల్‌మెంట్ పెంచడంలో భాగంగానే ఓపెన్ లర్నింగ్, ఆన్‌లైన్ డిజిటల్ విద్యపై ఫోకస్ పెట్టింది. విదేశీ వర్సిటీలకు భారత్‌లో క్యాంపస్‌లకు అవకాశం టాప్ 100 విదేశీ వర్సిటీలు లేదా కాలేజీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చింది. అంతేకాదు, ఇక్కడి అటానమస్ కాలేజీల కన్నా వీటికి నిబంధనలపై మినహాయింపులుంటాయని హెచ్‌ఆర్డీ పేర్కొంది. హెచ్‌ఆర్డీ నుంచి ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా మార్పు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్డీ) మంత్రిత్వ శాఖ పేరు మారనుంది. ఇకపై విద్యా శాఖగా పిలవనున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరును హెచ్ఆర్డీగా 1985లో మార్చారు. తాజాగా, మళ్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌గానే వ్యవహరించాలని ఇస్రో మాజీ చీఫ్ కే కస్తూరిరంగన్ నేతృత్వంలోని బృందం ప్రతిపాదించగా, కేంద్రం ఆమోదముద్ర వేసింది.