- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి బాగుంది.. భద్రాద్రిని మరిచిన ప్రభుత్వాలు..!
ఉత్తరాదిన రాముడి జన్మభూమి అయోధ్యలో అద్భుత రామమందిర నిర్మాణం జరుగుతోంది. మరి అదే రామయ్య ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న చోటు, వనవాస సమయంలో నడయాడిన నేల, దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు ముస్లిం రాజులచే కీర్తింపబడిన భద్రాచలం పుణ్యక్షేత్రం నేటి పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరమవుతోంది. అయోధ్య రామ మందిర నిర్మాణానికి పూనుకున్న పాలకులను వేనోళ్లా పొగుడుతూనే.. తాము పూజించే భద్రాద్రి రామయ్యకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని తెలుగు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రిని అపురూప కట్టడంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం భద్రాద్రి మీద చెప్పిన మాట నిలుపుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ ప్రతినిధి, ఖమ్మం: నవమి, వైకుంఠ ఏకాదశి సందర్భాలలో తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం దివ్యక్షేత్రాన్ని పట్టించుకోకపోవడంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో హిందువుల మనోభావాలను కాపాడుతున్నట్లు చెపుతున్న పాలకులు హిందూ, ముస్లింలతో పాటు అన్నివర్గాల వారు పూజించుకునే భద్రాచలం రామయ్యను మాత్రం విస్మరిస్తున్నారు. భద్రగిరి చుట్టూ అన్నీ రామాయణ కాలం నాటి ఆనవాళ్లే. సీతారాములు వనవాసం సమయంలో ఈ ప్రాంతంలోనే సేద తీరినట్లు అనేక చారిత్రక ఆధారాలూ ఉన్నాయంటున్నారు ఈ ప్రాంతవాసులు.
అణువణువూ రామనామంతో నిండిపోయిన ఈ ప్రాంతం గురించి రామాయణ కావ్యంలో అధిక భాగం ఉంటుంది. అయోధ్య రాముడికి జన్మనిచ్చిన స్థలం. భద్రాచలం రాముడికి ఆపత్కాలంలో ఆశ్రయిచ్చిన స్థలం. అందుకే భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తుంటారు. మరి ఇంతటి ప్రాశస్త్యం ఉన్న భద్రగిరికి రాష్ట్ర విభజనతో కష్టాలు వచ్చిపడ్డాయి. దేవస్థానం, పట్టణ ప్రాంత అభివృద్ధి అంతా కుంటు పడిపోయింది. ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తేనే భద్రాచలం పురోగతి సాధ్యం అవుతుందంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వవర్గాలు. భద్రాద్రి రామయ్యకు సంబంధించిన భూములన్నీ ఆంధ్రలో ఉండి.. గుడి మాత్రమే తెలంగాణలో ఉండడం కూడా సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలూ సమస్య పరిష్కారం దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు.
రూ. 100కోట్లు కేటాయిస్తే
భద్రాద్రి రామాలయాన్ని రూ. 100కోట్లతో అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ ఆ ఊసే మరిచారు. ఆరేళ్లు గడుస్తున్నా ఈ దరికి మాత్రం వచ్చి చూడలేదు. దేశం గర్వించేలా ఆర్కిటెక్ట్ ఆనందసాయి తయారు చేసిన డిజైన్ ప్రకారం రూపొందిస్తే భద్రాద్రి చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుదంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ నిర్మాణం చేపడితే నిజంగానే అత్యద్భుతమైన భద్రాద్రిగా మారుతుంది. రెండు ప్రాకారాలతో దేవస్థానం అత్యంత వైభవోపేతంగా దర్శనమిస్తుంది. కరకట్ట అందాలు వీక్షించేందుకు ఇప్పటికే భక్తులు ముచ్చటపడుతుంటారు. ఇక నూతన నమూనా ప్రకారం రామాయణ ఇతివృత్తాలను కళ్లకు కట్టేవిధంగా మరింత అందంగా మలిచేవారు. అంతేకాదు.. దేవస్థానం పరసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా వెలుగొందేవి. ఇక ఎత్తైన శ్రీరామ స్థూపం భద్రగిరికే వన్నె తెచ్చేది. నవీకరించిన పర్ణశాల అందాలూ భక్తులను మైమరచి పోయేలా చేసేవి. మొత్తంగా ఒక్కసారి భద్రాచలం వచ్చిన భక్తులకు అక్కడే చిరకాలం ఉండిపోయేలా.. ఆధ్యాత్మిక చింతనతో మనసు పరితపించేలా ఉండేది. కానీ ఇప్పటి పాలకుల తీరుతో భద్రాద్రి అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఊసేలేని రామాయణ థీమ్ పార్క్
భద్రాచలంలో రామాయణానికి సంబంధించి ఘట్టాలు, సన్నివేశాలతో థీమ్ పార్క్ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. దీని కోసం కొంత నిధులు సైతం కేటాయించారు. చివరకు ఆ ఊసే మరిచారు. స్వరాష్ట్రంలో పర్ణశాలలో రామాయణ థీమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరిగినా ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. ఆలయ అభివృద్ధి కి సంబంధించి గతంలో బడ్జెట్ లో నిధులు కేటాయించినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అంతేకాదు ఈ ప్రాంతాన్ని రామాలయ సర్క్యూట్ లో చేర్చిన కేంద్రం పట్టించుకోవడం మానేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతో ప్రాశస్త్యం కల్గిన ఈ పుణ్యక్షేత్రం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. భద్రాచలం పర్యాటకంగానూ ఎంతో అనుకూల ప్రదేశం. దృష్టి పెడితే ప్రభుత్వానికీ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవే.
నేడు భద్రాద్రి అభివృద్ధి కోసం విశాఖ స్వామీజీ చైతన్య యాత్ర
ఇప్పటి వరకు భద్రాద్రి అభివృద్ధి కోసం పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే పోరుబాట పట్టాయి. స్వయంగా రాముడి నడయాడిన నేలను నిర్లక్ష్యం చేయొద్దంటూ భక్తులు సైతం ఎన్నో సార్లు విన్నవించారు. అయితే ఇప్పుడు స్వామీజీలు సైతం ఈ ప్రాంత అభివృద్ధికి నడుం బిగిస్తున్నారు. దీనిలో భాగంగానే విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వామిజీ, శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి నేడు భద్రాచలం రానున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చైతన్య యాత్ర ప్రారంభించనున్నారు. అవసరం అయితే 50 మంది స్వామీజీలతో భద్రాచలంలో నిరాహారదీక్షలు చేయడానికి సైతం సమాయత్తం అవుతున్నట్లు కూడా సమాచారం.